హస్తినమే సవాల్‌

5A

బహిరంగ చర్చకు రా

కిరణ్‌బేడీకి కేజ్రీవాల్‌ చాలెంజ్‌

దిల్లీ,జనవరి20(జనంసాక్షి): ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ భాజపా దిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేదీకి సవాలు విసిరారు. తనతోపాటు బహిరంగ చర్చలో పాల్గొనాలంటూ ట్విట్టర్‌లో సవాలు చేశారు. కేజ్రీవాల్‌  సవాల్‌ను స్వీకరించిన కిరణ్‌బేదీ చర్చకు సిద్దమేనని ప్రకటించారు. కేజ్రీవాల్‌ కు చర్చ విూద నమ్మకం ఉంటే, తనకు మాట్లాడే ధోరణిపై నమ్మకం ఉందనికిరణ్‌బేదీ పేర్కొన్నారు. దీనికి అసెంబ్లీ వేదికగా చర్చించడానికి సిద్దమన్నారు. ఇదిలావుంటే దేశరాజధాని దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌కేజీవ్రాల్‌, కిరణ్‌బేడీ మధ్య నువ్వానేనా అన్నంత తీవ్రంగా పోటీ ఉండనుందని ఒక సర్వే వెల్లడించింది. ఈ నెల 17 నుంచి 19 వరకూ దిల్లీలో నీల్సన్‌ సర్వే చేపట్టింది. ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ మాజీ సీఎం అరవింద్‌కేజీవ్రాల్‌కు 47 శాతం మంది మద్దతు పలకగా.. భాజపాలో ఇటీవలే చేరిన తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి కిరణ్‌బేడీకి 44 శాతం మంది మద్దతిచ్చారు. మహిళల్లో దాదాపు 50 శాతం మంది కేజీవ్రాల్‌ను, 41.4 శాతం మంది బేడీని బలపరిచారు. కిరణ్‌బేడీ ఆప్‌లో చేరి ఉండాల్సిందని సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది అభిప్రాయపడటం విశేషం. ఆమె భాజపాలో చేరటం సరైనపనేనని 33 శాతం మంది చెప్పారు. మరోవైపు దిల్లీలో మరోసారి హంగ్‌ అసెంబ్లీ ఏర్పాటు కానుందని మరో సర్వేలో వెల్లడైంది. ఇదిలావుంటే ఇటీవలే పార్టీలో చేరిన ప్రముఖ సామాజిక కార్యకర్త, తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి కిరణ్‌బేడీని దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భాజపా ప్రకటించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలను బేడీ నాయకత్వంలోనే ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.  కృష్ణానగర్‌ నియోజకవర్గం నుంచి కిరణ్‌బేడీ పోటీ చేస్తారని షా తెలిపారు. ఈ నిర్ణయాలను పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా తీసుకుందన్నారు. మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌తో కలిసి ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. దీంతో తన విజయావకాశాలను బేడీ దెబ్బతీశారని కేజ్రీవాల్‌ అభిప్రాయపడుతున్నారు. అందుకే చర్చచకు సవాల్‌ విసరారని అంటున్నారు. మొత్తానికి ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగే వీలుంది.