హస్తినలో సుస్థిర ప్రభుత్వం అవసరం- మోదీ

3

న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. శనివారం  ఆయన తూర్పు ఢిల్లీలో విశ్వాస్‌నగర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో మాట్లాడారు. గత ఏడాది విూరు ఓటు వేసిన వాళ్లు ఢిల్లీని వెనక్కి తీసుకెళ్లారని వెల్లడించారు. ఢిల్లీ ప్రజల ఆశలు, కలలన్నీ అడియాశలయ్యాయని అన్నారు. ఎవరైనా సరే ప్రజలను ఒక్కసారి మాత్రమే మోసం చేయగలరని పదేపదే చేయలేరని తెలిపారు. ఈసారి కిరణ్‌బేడీని ఎన్నికల్లో గెలిపిస్తే ఢిల్లీని ఉన్నతస్థానానికి తీసుకెళ్తారని పేర్కొన్నారు. ఢిల్లీకి ఏ పార్టీ బాగా సేవ చేయగలదో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఈసారి ఢిల్లీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేస్తారని తెలిపారు. ఢిల్లీలో ప్రతీ కుటుంబానికి స్వంత ఇళ్లు ఉండాలనేది బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ఎన్నికల ర్యాలీలు చేస్తే తమకు అంత మంచిదని పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రధానంగా బీజేపీకి ఆప్‌కు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.