తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి…
సాయుధ పోరాట స్పూర్తితో భూ పోరాటాలు కొనసాగిస్తాం..
సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కె. బిక్షపతి…
హన్మకొండ బ్యూరో చీఫ్ 14 సెప్టెంబర్ జనంసాక్షి
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బిజెపి పార్టీ వక్రీకరిస్తున్నదని సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఉట్కూరి రాములు అధ్యక్షతన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో బిజెపి, ఆర్ఎస్ఎస్ లకు ఎలాంటి పాత్ర లేదని, ఆ పోరాటంలో పాల్గొన్న సాయుధ పోరాట యోధులకు ఫించన్లు ఇవ్వకుండా కేంద్రంలో గతంలో అధికారంలో వున్న బిజెపి కేంద్ర మంత్రి విద్యాసాగర్ రావు నిరాకరించారని అన్నారు. తెలంగాణ విమోచనంపై మాట్లాడే హక్కు బిజెపికి లేదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల స్థలాలు, సాగు భూములు దక్కే వరకు సాయుధ పోరాట స్పూర్తితో భూ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పారు. అక్టోబర్ 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. జాతీయ మహాసభలలో భాగంగా ఆగష్టు 14న విజయవాడలో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన సిపిఐ జిల్లా సమితి సభ్యులు, హసన్ పర్తి మండల కార్యదర్శి గిన్నారపు రోహిత్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని పార్టీ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, నాయకులు ఆదరి శ్రీనివాస్, మద్దెల ఎల్లేష్,మండ సదాలక్ష్మి, కర్రె లక్ష్మణ్, నకీర్త ఓదెలు పాల్గొన్నారు.
Attachments area
|