హావిూల అమలుకు ప్రభుత్వం పూనుకోవాలి : సున్నం
భద్రాచలం,డిసెంబర్21(జనంసాక్షి): టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చినందున ఇచ్చిన హావిూ మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించచాలని మాజీ సీపీఎం ఎమ్మెల్యే సున్నంరాజయ్య కోరారు. రాష్ట్రంలో ఎక్కడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కేవలం దత్తత గ్రామంలో నిర్మించినంత మాత్రాన ప్రజలందరికి నిర్మించి ఇచ్చినట్లు కాదన్నారు. ఈ పథకం ప్రకటించిన మేరకు అందరికి వర్తింపచేసి పేదలను ఆదుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని అన్నారు. కోల్‌బెల్ట్ భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని శోభన్‌నాయక్ కోరారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్లే ఆదివాసీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలన్నీ ఆదివాసీలకు అన్యాయం చేశాయన్నారు. ఆదివాసీలకు దక్కాల్సిన హక్కులు దక్కకపోవడం, కల్పించిన రిజర్వేషన్లు వారి కోసం అమలు కాకపోవడంతో ఆదివాసీల్లో అసంతృప్తి నెలకొందన్నారు. హక్కుల కోసం ఆదివాసీలు చేస్తున్న ఆందోళనల వెనుక నక్సల్స్, కమ్యూనిస్టులు ఉన్నారని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని విమర్శించారు. లంబాడాలు, ఆదివాసీలు సంయమనం పాటించి సమస్య పరిష్కారం కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.