హింసకు వ్యతిరేకంగా తెలుగు కవిత్వం

హింస హింసను పట్టిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా హింసని ప్రజ్వలింపచేస్తూనే వుంటారు. కాలక్రమంలో కొన్ని పదాల మౌలిక అర్థాలు మారిపోతున్నాయి. ఏది హింసో, ఏది అహి ంసో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలుగులో హింసకి వ్యతిరేకంగా రాజ్యహింసకి వ్యతిరేకంగా చాలా కవిత్వం వచ్చింది. రోజు రోజుకి జనజీవన స్రవంతిలో హింసే ప్రధాన పాత్ర వహి స్తుంది. అన్ని వాదాలను పక్కనపెట్టి హింసకి వ్యతిరేకంగా కవిత్వం వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో హింసకి వ్యతిరేకంగా వచ్చిన కొన్ని కవిత్వాలని పరిశీలిద్దాం. మానేపల్లి 1992లో రాసిన కవిత గుర్తుకొస్తుంది. ఆ కవిత పేరు ‘మరణం శరణం గచ్ఛామి’ ఆ కవిత ఇలా మొదలవుతుంది.
పౌర హక్కుల గురించి ప్రశ్నిస్తున్నావా?
పోలీసులు తలుపుకొట్టి పిలిచి మరీ చంపగలరు
దళితుల హక్కుల గురించి మాట్లాడుతున్నావా?
అగ్రవర్ణాల వారు హత్యాచారం చెయ్యగలరు
ప్రజా సమస్యల గురించి తీవ్రంగా పోరాడతావా?
ఎన్‌కౌంటరయిపోగలవు
ఒక ప్రశ్న ఒక జవాబుతో నడుస్తుంది. ఈ కవితలో ఎలాంటి పదబంధాలు లేవు. అర్థం కాని పదాలు లేవు. కానీ భావావేశం వుంది. ఒక సత్యం వుంది. అది ఈ రోజుకి కూడా సరిపొయ్యే విధంగా వుంది. మూడు నాలుగు ప్రశ్నలు జవాబులు చెప్పి చివరలో ఒక సమాధానం చెబుతారు. ఆ సమాధానానికి ప్రశ్న వుండదు. ఒక ప్రభోదం వుంటుంది. ఒక సూచన వుంటు ంది. ఇలా సాగుతుంది కవిత.
ముసలితనంతోనో రోగాల్తోనో
రోడ్డు ప్రమాదంలోనో చావడం కంటే
ప్రజల కోసం పోరాడుతూ చావాలనే కోరుకుంటారు.
ఒక ప్రభోదంతో అనే బదులు ఓ కర్తవ్యంతో ముగు స్తుందీ కవిత అంటే మరీ బాగుంటుందేమో. తెలంగాణ పల్లెలు ఎలా వుంటున్నాయి. ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాయి. మరి ఖాకీ స్థావరాలు ఎలా వున్నాయి. వాళ్ల తీరుతెన్నులు ఎలా వున్నాయి. అదొక మాయ ప్రపంచం. జరిగింది జరగనట్లు, జరగంది జరిగి నట్లు ఏమైనా కావొచ్చు. అక్కడ గాలి కూడా వణికిపోతుంది. అక్కడ న్యాయం నాలుగు కాళ్లమీద నడుస్తుంది. అక్కడ న్యాయమే కాదు పరిశోధనలూ జరుగుతాయి. కవి (జింబో) మాటల్లో విందాం.
అక్కడ చిత్రహింసల మీద
పరిశోధనలు జరుగుతాయి
క్రొత్తక్రొత్త పనిముట్లు కనుక్కోబడతాయి
కాస్సేపు వాళ్లు సైంటిస్టులవుతారు
మనిషిని నిర్వీర్యం ఎలా చెయ్యాలో
వాళ్లకి తెలిసినంత డాక్టర్లకి కూడా తెలియదు
కథల్ని సృష్టించడం
విషయాలని వక్రీకరించడం
వాళ్లకి తెల్సినంత
మన వ్యాపార రచయితలకి కూడా తెలియదు
ఒక ధ్వనిలో సాగుతుంది ఈ కవిత. కవిత ఇలా ముస్తుంది.
సృష్టికి ప్రతి సృష్టి సృష్టించి
వాళ్లు విశ్వామిత్రులవుతారు
అక్కడ
ఫిర్యాదు ఒక బ్లాంక్‌ చెక్కు
అది రెండు వైపులా చెల్లుతుంది
ఫిర్యాదు ఒక బ్లాంక్‌ చెక్కు. దాంట్లో ఖాకీలకి తోచినంత సంఖ్యని వేసు కోవచ్చు. రెండు వైపులా చెల్ల డం అంటే అది ఫిర్యాది దగ్గర నుంచి డబ్బు లాగ డానికి ఉపయోగపడుతుంది. ముద్దాయి దగ్గర నుంచి డబ్బు లాగడానికి ఉపయో గపడుతుంది. అందుకే అది రెండు వైపులా చెల్లే బ్లాంక్‌ చెక్కని కవి అంటాడు. ఇది ఖాకీ స్థావరాల గురించి కవిత. ఇది 1995 ప్రాంతంలో చదివింది. ‘కసాయి’ అన్న పేరుతో వరవ రరావు 1985లో ఓ కవిత రాశారు. అది కసాయి వాడి స్వగతం. కసాయివాడు మనల్ని ఉద్దేశించి చెబుతున్న కవిత. ఆ కవిత ఇలా మొదలవుతుంది.
నేను కటికవాణ్ని
కసాయివాణ్ని అంటారా
పోనీ మీ ఇష్టం అనండి
రోజూ జీవుల్ని చంపుతూనే వుంటాను
పోగులేసి అమ్ముతూనే వుంటాను
నెత్తురు కళ్ల చూడడం నాకు కొత్తకాదు
కాని
కసాయితనమేమిటో మాత్రం
ఆ రోజు కళ్లారా చూసాను
నా కళ్లలో గూడుకట్టుకున్న భయంలో
ఆ పసిబాలుని నెత్తురు గడ్డ కట్టింది
నా గొంతులోంచి పెగలని మాటలో
అతని స్వరం పిడచగట్టింది
తను కటికవాడు. కసాయివాడు. రోజూ జీవుల్ని చంపు తాడు. అలాంటి మనిషికి కసాయితనం తెలిసిన రోజు. ఆ రోజు ఎలా వుంది. అతని కళ్లలో భయం గూడుకట్టుకుని వుంది. ఆ భ యంలో ఆ చనిపోయిన పసిబాలుని నెత్తురు గడ్డ కట్టింది. భయాన్ని నెత్తురు గడ్డ కట్టిందని అంటాడు కవి. అట్లాగే అతని గొంతులో నుంచి రాని మాటలో ఆ బాలుని స్వరం పిడచగట్టిందట. ఇంకా ఇలా అంటాడు కవి. ఆ రోజు నెత్తురు చిల్లింది రోడ్డు మీద కాదు అతని గుండెల మీద. ఇక్కడితో ఇది పోలీసుల చేతిలో చనిపోయిన కుర్రవాడిని చూసిన కసాయి వాడి వ్యథ. కవిత ఇలా ముగుస్తుంది.
మంత్రి అంటే ప్రభుత్వమనీ
పోలీసులంటే రక్షకులనీ
ఎవరి ప్రభుత్వమో ఎవరి రక్షకులో
ఎగిరిపోయిన
అమరుని ప్రాణాలు చెప్పినయ్‌
ప్రభుత్వమే అసలు కసాయి
అర్థమయ్యింది నాకు
ఇలాంటిదే మరో కవిత ‘హెచ్చరిక’ ఈ కవితని ఆజం రాశాడు. కవితలోని మొదటి చరణాలు ఇలా మొదలవుతాయి. సైకిళ్లకు కుందేళ్లు వేలాడేసుకొస్తున్నట్టు జీవులకు మృతదేహాలను వే లాడేసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా వుండాలో ఈ కవితలో ఆజం హెచ్చరిస్తున్నాడు. ఈ కవిత కూడా 2001లో రాసింది. నిశ్శబ్దంగా వుంటే ఏమవుతుందో కూడా హెచ్చరిస్తాడు. ఈ కవితలో…
మీ ఇంటి గుమ్మం ముందు
మృత్యువు పొంచి వుంది
ఏ క్షణమైనా ఏ రూపంలోనైనా నిన్నూ
నీ కుటుంబాన్ని
కబళించవచ్చు
అపుడు నీ కోసం కనీసం మొరిగిందేకు
నీ పెంపుడు కుక్క కూడా మిగలదు.
అందుకని నోరు విప్పమని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టమని కవి హెచ్చరిస్తాడు. ఈ కవితలన్నీ పాత కవితలు. హింసకి ముఖ్యం గా రాజ్యహింసకి వ్యతిరేకంగా రాసినవి. ఈ కవితల్లో అన్వయ కారి న్యత లేదు. సూటిదనం వుంది. సరళత్వం వుంది. కానీ భావకా ఠిన్యం వుంది. ఈ రాజ్య హింసకి వ్యతిరేకంగా మాట్లాడకూ డదనుకునే వాళ్లను బాధపెట్టే కాఠిన్యం వుంది. కర్తవ్యం వుంది. కవిత్వం వుంది. అర్థంకానిది ఏమీ లేదు. కానీ చాలా మందికి అ ర్థం కానింది హింసే. కవి (జింబో) మాటల్లో…
ఏది హింసో
ఏది ప్రతి హింసో
హింసా ప్రవృత్తి పెరిగింది
పావురాల్లోనా
‘కాకు’ల్లోనా
అర్థంకాక
విద్యుద్దీపం ఆరిపోతుంది.
మరి విద్యుద్దీపం ఎప్పుడు వెలుగుతుంది?