హింసను వీడితేనే చర్చలు

ఉగ్రవాదుల దాడులు పిరికిపంద చర్యలు
ప్రధాని మన్మోహన్‌
శ్రీనగర్‌, జూన్‌ 25 (జనంసాక్షి) :
హింసను వీడితేనే ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఉగ్రవాద చర్యలను భారత్‌ సంఘటితంగా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. దాడులు పిరికివారి చర్య అని, ఉగ్రవాదులు ఎప్పటికీ విజయం సాధించలేరని స్పష్టం చేశారు. మంగళవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో కలిసి 850 మెగావాట్ల రాటిల్‌  పవర్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుచోట్ల మన్మోహన్‌ విలేకరులతో మాట్లాడారు. సోమవారం హైదర్‌పోరాలో ఉగ్రవాదులు దాడి చేసి 8 మంది జవాన్లను హతమార్చిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. యావత్‌ భారతదేశం ఉగ్రవాద చర్యలను సంఘటితంగా ఎదుర్కొంటుందని, ముష్కరులు ఎన్నటికీ విజయవంతం కాలేరన్నారు. భద్రతా బలగాలను మరింత పటిష్టవంతం చేస్తామన్నారు. తీవ్రవాదుల దాడులు శాంతిభద్రతలకు భంగం కలిగించలేవని తెలిపారు. ‘జమ్మూకాశ్మీర్‌లో భద్రత పరిస్థితి మెరుగుపడిరది. గత రెండు దశాబ్దాల కంటే 2012 తర్వాత ఉగ్ర హింసలకు క్రమంగా తగ్గుముఖం పట్టిందని’ అన్నారు. అయినప్పటికీ, మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని, అందుకు సోమవారం నాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని, సోనియా సంతాపం ప్రకటించారు. జమ్మూకాశ్మీర్‌లో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని, విద్యుత్‌ కొరతను తగ్గిస్తామని మన్మోహన్‌ హామీ ఇచ్చారు. లేప్‌ాలో ఏడాది పొడవునా విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. నార్తర్న్‌ గ్రిడ్‌ నుంచి అదనంగా 150 మెగావాట్లను అందిస్తామని చెప్పారు. అంతకుముందు ఉగ్రవాదుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధాని మన్మోహన్‌, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ, జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పరామర్శించారు.
స్తంభించిన జన జీవనం
ప్రధాని పర్యటనను నిరసిస్తూ వేర్పాటు సంస్థలు హురియత్‌ కాన్ఫరెన్స్‌, జేకేఎల్‌ఎఫ్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో కాశ్మీర్‌లో జన జీవనం స్తంభించింది. విద్య, వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. బ్యాంకులు, ప్రైవేట్‌ కార్యాలయాలు కూడా తెరచుకోలేదు. మరోవైపు, సోమవారం ఉగ్రవాదులు విరుచుకుపడడంతో ప్రధాని పర్యటనకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. పోలీసు, సీఆర్పీఎఫ్‌ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. విస్తృత తనిఖీలు నిర్వహించారు.