‘హిజిబుల్‌’ దాడి 8 మంది జవాన్ల మృతి

ప్రధాని పర్యటనకు ముందు పేట్రేగుతున్న మిలిటెంట్లు
శ్రీనగర్‌, జూన్‌ 24 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి హిజిబుల్‌ ముజాహిద్దిన్‌ మిలిటెంట్లు పేట్రేగిపోయారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యటనకు ఒక రోజు ముందు ఆర్మీ క్యాన్వాయ్‌పై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ శివారులోని బెమినా వద్ద సైనికుల క్యాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం హైదర్‌పొరా బైపాస్‌లో బెమినా మీదుగా వెళుతున్న వాహనశ్రేణిపై రహదారి ఇరువైపుల నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది జవాన్లు మృతిచెందారు. మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన కొంతసేపటికే ఆ ప్రాంతాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టాయి. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు ఒక కారులో పారిపోయినట్టు తెలుస్తోంది. భద్రతా దళాలపై కాల్పులు జరిపింది తామేనని హిజ్బుల్‌ ముజాహిద్ధీన్‌ సంస్థ ప్రకటించుకుంది. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలోనూ ప్రధాని మన్మోహన్‌ కాశ్మీర్‌ పర్యటనలో ఎలాంటి మార్పులు ఉండబోవని ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. మంగళ, బుధవారాల్లో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో కలిసి ప్రధాని కాశ్మీర్‌లో పర్యటిస్తాయని తెలిపాయి.