హిమాచల్‌ దుర్ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య


కొండప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
14మంది క్షతగాత్రులను రక్షించినట్లు వెల్లడి
సిమ్లా,ఆగస్ట్‌12(జనం సాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌ కన్నౌర్‌ జిల్లాలో కొండచరియలు విరిగి వాహనాలపై పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రస్తుతం ఇంకా అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారని, 40 మంది గల్లంతయ్యారని, 14 మంది క్షతగాత్రులను రక్షించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారి సహాయ ఐదుగురు మహిళలు ఉన్నారు. బుధవారం ఉదయం నేషనల్‌ కన్నౌర్‌ జిల్లాలోని రెహ్లాన్‌ `సియో హైవేపై వెళ్తున్న సమయంలో టన్నుల కొద్దీ బరువున్న బండరాళ్లు ఎత్తయిన కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చి రోడ్డుపై నుంచి వెళ్తున్న వాహనాలపై పడిపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు
చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించగా.. టిప్పర్‌, రెండు కార్లు, సుమోను వెలికి తీశారు. మహిమాచల్‌ప్రదేశ్‌ ఆర్టీసీకి చెందిన బస్సును ఇంకా గుర్తించాల్సి ఉంది. పగటి పూట డ్రోన్లసహాయంతో బస్సు జాడ కోసం అన్వేషించినా ఫలితం లేకుండా పోయింది. రాత్రి సమయంలో స్లటెజ్‌ నది వద్ద వెతికినా జాడ కనిపించలేదు. బస్సు మొదట.. మూరాంగ్‌ నుంచి రేకాంగ్‌ పియోకు చేరింది. అక్కడ పలువురు ప్రయాణికులు ఎక్కిన తర్వాత హరిద్వార్‌కు బయలుదేరింది. బస్సులో దాదాపు 22 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఆర్మీ, ఐటీబీపీకి చెందిన బలగాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు చెందిన 200 మంది జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద పలు వాహనాలు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద 50 మంది చిక్కుకున్నారని.. వారిలో పది మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌విూడియాలో వైరల్‌గా మారింది. హైవేపై కొండచరియలు విరిగిపడటంతో పలువాహనాలు లోయలోకి జారి పడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. కాగా, ఇండో`టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబిపి)కి చెందిన 200 మంది బృందాలను సహాయక చర్యలకోసం పంపినట్లు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) కూడా రెస్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో గత కొన్ని వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. గతనెలలో కిన్నౌర్‌లో భారీ కొండరాళ్లు కార్లపై పడటంతో తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే.