హైదరాబాదీలకు హ్యాట్సాఫ్
సంయమనం.. తెగువ అభినందనీయం
పేలుళ్ల ప్రాంతం సందర్శన
క్షతగాత్రులకు పరామర్శ
మేమున్నాం.. భరోసా ఇచ్చిన ప్రధాని
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) :
హైదరాబాదీలు చూపిన తెగువ, సంయమనానికి హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మన్మోహన్ నేరుగా దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మేమున్నామని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మొదట మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితుల బాధను పంచుకునేందుకే తాను వచ్చానని అన్నారు. పేలుళ్ల ఘటన దురదృష్టకరమన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానన్నారు. గాయపడిన వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులను కాపాడేందుకు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని చెప్పారు. వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని అన్నారు. పరిస్థితులు సర్దుకుంటాయని, ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల దాడులను దేశ ప్రజలు తిప్పిగొడతారని అన్నారు. బాంబులతో సామాన్యులను చంపడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.ప్రధాని పరామర్శ చకచక..
ప్రధాని మన్మోహన్‌సింగ్ పరామర్శ పర్యటన ఆద్యంతం చకచకా సాగింది. పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ఆదివారం ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి 11.10 గంటలకు ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో సరూర్‌నగర్ విక్టోరియా హోంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ వద్ద దుర్ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడికి 150 మీటర్ల దూరంలో ఉన్న వెంకటాద్రి థియేటర్ వద్దకు కాలినడకన చేరుకుని అక్కడి దుర్ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. గురువారం రాత్రి ప్రమాదం చోటు చేసుకున్నప్పటి నుంచి ఆదివారం ఉదయం వరకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి వివరించారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో మలక్‌పేట యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. పేలుళ్ల బాధితులను పరామర్శించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్నారు. అక్కడ సుమారుగా పదిహేను నుంచి 20 నిమిషాల పాటు గడిపారు. అక్కడి నుంచి కిలోమీటరన్నర దూరంలో ఉన్న ఓమ్ని ఆసుపత్రికి చేరు కున్నారు. అక్కడ బాధితులను పరామర్శించి ఓదార్చారు. వారిలో భరోసా కల్పించారు. అక్కడ కూడా ఇరవై నిమిషాల పాటు గడిపారు. అక్కడి నుంచి 12.30 గంటలకు విక్టోరియా హోంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో 20 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డీజీపీ దినేష్‌రెడ్డి, నగర సీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఉన్నారు. సమీక్ష సమావేశం అనంతరం ప్రధాని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.