హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ : మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టు యూనియన్ల భాగస్వామ్యంతో బషీర్‌బాగ్‌ టీయూడబ్ల్యూజే కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చూస్తే ఎమర్జెన్సీ నాటి దుష్ఫలితాలను ప్రభుత్వాలు ఎలా అనుభవించాయో గుర్తుంచుకోవాలన్నారు. న్యూస్‌ క్లిక్‌పై దాడులు, జర్నలిస్టుల ఇండ్లల్లో తనిఖీలు చేసి నిర్బంధించడం సరికాదన్నారు. ఈ దాడులను ప్రజాస్వామికవాదులు ఖండిరచాలని, ప్రశ్నించే గొంతుకలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ నిరసన ప్రదర్శనలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, ఐఏఎస్‌ మాజీ అధికారి ఆకునూరి మురళీ, ప్రొఫెసర్లు హరగోపాల్‌, కోదండరాం, పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, పద్మజషా, ఖాసీం, వివిధ పత్రికల సంపాదకులు, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.