హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులు ఉన్నారనే అనుమానంతో దాడులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారమందడంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం నుంచి రంగంలోకి దిగారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు ఐసిస్ సానుభూతిపరులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. మరో వైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి టర్కీ వెళ్లే విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.