హైదరాబాద్‌లో కేరళ భవన్‌: సీఎం కేసీఆర్‌

1

హైదరాబాద్‌, ఫిబ్రవరి1,(జనంసాక్షి): కేరళ ప్రజలది దేశంలో ఎక్కడున్నా ఒదిగిపోయే మంచి మనస్తత్వమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని మలయాళీయులను ప్రశంసించారు. ఇవాళ ఆయన బాలానగర్‌లోని ఎన్‌ఎస్‌కేకే పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కేరళీయం-2015 ఫెస్టివల్‌లో పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవం సందర్భంగా సీఎం కేరళీయులకు మలయాళంలో శుభాకాంక్షలు తెలిపి అందరిని ముగ్దుల్ని చేశారు. రాష్ట్రంలో సుమారు 3 నుంచి 4 లక్షల మంది కేరళ ప్రజలు ఉన్నారని సీఎం అన్నారు. హాస్పిటల్‌ పెట్టాలనుకునే ప్రతీ యజమాని కేరళ నర్సులు సగం మందైనా ఉండాలని కోరుకుంటారని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న కేరళీయుల కోసం ఒక భవనాన్ని నిర్మింపజేస్తామని ప్రకటించారు. నగరం నడిబొడ్డులో ఉన్న మహేంద్రహిల్స్‌లో కేరళ భవనం కోసం ఎకరం భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. భవన నిర్మాణం కోసం రూ.కోటి కూడా మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ భవనాన్ని కేరళ ప్రజలు కేరళ భవనం అని పేరు పెట్టుకుంటారో లేక మళయాల భవనం అని పేరు పెట్టుకుంటారో వాళ్ల ఇష్టమన్నారు. వచ్చే సంవత్సరం కేరళీయం ఉత్సవాలు కేరళ భవన్‌లోనే జరుగుతుందని మళ్లీ దానికి తాను హాజరవుతానని కేసీఆర్‌ అన్నారు.హైదరాబాద్‌ మినీ ఇండియా

హైదరాబాద్‌ ఒక మినీ ఇండియాగా సీఎం అభివర్ణించారు. వృత్తిరీత్యనో, మరో పని విూదనో వివిధ ప్రాంతాల్లో నివసిస్తుంటామని వ్యాఖ్యానించారు. కేరళ ప్రజలకు తెలంగాణలో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌, హాల్‌, కిచెన్‌లతో ఇళ్లు ఉంటాయని తెలిపారు. ఇక్కడ ఉంటున్న కేరళీయులు తనకు వారి పేర్లతో జాబితాను తయారు చేసి ఇవ్వాలని కేరళ నేతలను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కేరళ బిడ్డలు ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన కేరళ ప్రజలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్‌లో కార్యక్రమాల్లో యాంకరింగ్‌ చేస్తోన్న సుమ కేరళ యువతి అని తనకు ఇంత వరకు తెలియదన్నారు. ఇక్కడికి వచ్చాకే ఆమె కేరళ యువతి అని తెలిసిందన్నారు. సుమ తెలుగు అమ్మాయిలా చక్కగా తెలుగు భాషలో యాంకరింగ్‌ చేస్తోందని కితాబిచ్చారు.