హైదరాబాద్‌లో ఘోరం

1

– భవనంపై కప్పు కూలి ఇద్దరు వలస కూలీల మృతి

హైదరాబాద్‌,జూన్‌ 11(జనంసాక్షి):  నగరంలోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. హుస్సేనీ ఆలం వద్ద నిర్మాణంలో ఉన్న మూడంతస్థుల భవనం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారమందుకున్న అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న భవనం శ్రీమహేశ్వరి సేవా ట్రస్ట్‌కు చెందినదని అధికారులు వెల్లడించారు. పైకప్పు నిర్మాణం సరిగా లేకపోవడం లేదా సెంట్రింగ్‌ సరిగా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా అన్నది ఆరా తీస్తున్నారు. భవనం కూలిన ఘటనపై పోలీసులు, కార్మికశాఖ విచారణ చేపట్టారు. భవనం కూలిన ఘటనపై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితుల వివరాలును కార్మికశాఖ సిబ్బంది తెలుసుకుంటున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని కార్మికశాఖ అధికారులు హామి ఇచ్చారు. భవన యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కూలీలు మృతి చెందారని బాధితుల బంధువులు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని బంధువులు ఆందోళనకు దిగారు.