హైదరాబాద్‌లో దారుణం

– నడిరోడ్డుపై వ్యక్తిని హతమార్చిన దుండగులు
– మృతుడు నాగర్‌కర్నూల్‌ జిల్లా వాసిగా గుర్తింపు
హైదరాబాద్‌, నవంబర్‌29(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలంరేపుతున్నాయి. బుధవారం రాత్రి పాతబస్తీలో ఆటో డ్రైవర్‌ను నడిరోడ్డుపై నరికి చంపిన ఘటనను మర్చిపోకముందే మరో హత్య జరిగింది. గురువారం ఉదయం నగర శివారులోని బీఎన్‌ రెడ్డి నగర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని వేటకొడవలితో నరికి చంపారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌గా గుర్తించారు. మృతుడు, హత్య చేసిన వ్యక్తి ఒకే కారులో వచ్చారని.. బయటకు దిగాక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గొడవ తర్వాత శ్రీనివాస్‌ గౌడ్‌ను వేటకొడవలితో దారుణంగా హత్యచేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ కోపంతోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  మరోవైపు అక్రమ సంబంధం ఏమైనా ఈ హత్యకు దారితీసిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.