హైదరాబాద్‌లో యాపిల్‌

  • appleరేపే డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభం 
  • తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ? 
  • సీఈవో టిమ్‌ కుక్‌ రాకపై సస్పెన్స్‌ 
  • భారత్ మార్కెట్‌పై దృష్టి

 

హైదరాబాద్‌: గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల బాటలో హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకున్న విశ్వవిఖ్యాత ఐటీ దిగ్గజం యాపిల్‌ అనుకున్న దానికంటే ముందే తన పని ప్రారంభిస్తోంది. జూన్‌లో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని మొదలెట్టాలనుకున్న యాపిల్‌ మరింత ముందుగానే గురువారం హైదరాబాద్‌లో తమ సాంకేతికాభివృద్ధి కేంద్రాన్ని ఆవిష్కరించబోతోంది. పదవీబాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్‌లో కాలిడిన యాపిల్‌ అధినేత టిమ్‌కుక్‌ ఇందుకోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌ వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన యాపిల్‌ సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ఆరంభిస్తారని సమాచారం. గురువారం ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్‌ శివారు గచ్చిబౌలిలోని తిష్‌మాన్‌ స్పేయర్‌ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండున్నర లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ యాపిల్‌ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. యాపిల్‌ మ్యాప్స్‌ తయారీకి ఇది ప్రధాన కేంద్రం కాబోతోంది.

గూగుల్‌ పంథాలో మ్యాప్స్‌ రూపకల్పన…
గూగుల్‌ మాదిరిగానే యాపిల్‌ కూడా మ్యాప్స్‌ను తయారుచేయాలని నిర్ణయించింది. తమ ఫోన్లు, మ్యాక్‌ల్లో యాపిల్‌ మ్యాప్స్‌ ఉండాలనుకుంటోంది. ఇందుకోసం ప్రాథమికంగా 1000 మందితో ఆరంభించి.. వచ్చే ఏడాదికల్లా సుమారు 4500 మందికి హైదరాబాద్‌ కేంద్రంలో ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాపిల్‌ సంస్థ అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయం ఆవల ఏర్పాటుచేస్తున్న కీలక సాంకేతికాభివృద్ధి కేంద్రం ఇదేనంటున్నారు. యూరోప్‌లోని అనేక ప్రాంతాలతో పాటు, భారత్‌లోనూ బెంగళూరు, పుణె తదితర చాలా నగరాలను పరిశీలించాక యాపిల్‌ సంస్థ తుదకు హైదరాబాద్‌ను అనువైన స్థలంగా ఎంచుకుంది. జూన్‌లో ఆవిష్కరణ కేంద్రంతో ఆరంభించి.. సంవత్సరాంతానికి మ్యాప్స్‌ విభాగం పని పూర్తిస్థాయిలో మొదలెట్టాలని తొలుత అనుకున్నారు. అయితే 15రోజుల ముందే కేంద్రాన్ని ఆరంభిస్తుండటం గమనార్హం.

భారత్‌ మార్కెట్‌పై దృష్టి…
చైనాకు ప్రాధాన్యమిస్తూ వచ్చిన యాపిల్‌ సంస్థ తాజాగా భారత్‌లో మార్కెట్‌పై దృష్టిసారించింది. భారత్‌లో కార్యకలాపాలను విస్తరించాలని కూడా యోచిస్తోందని వార్తలొస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రం ఆరంభం కాబోతుండటం, కుక్‌ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ‘హైదరాబాద్‌లో సాంకేతికాభివృద్ధి సంస్థ ఏర్పాటు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా ఈ ప్రక్రియకు మద్దతుగా నిలిచే స్థానికులకు కూడా ఈ కేంద్రంలో చోటుంటుంది’ అని ఇటీవల యాపిల్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనటం గమనార్హం.

నగరాన్ని ఎంచుకోవటం గర్వకారణం
ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, డెల్‌లాంటి ఐటీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరాయి. దక్షిణాసియాలోనే తమ అతిపెద్ద సొంత ప్రాంగణాన్ని నిర్మించటానికి గూగుల్‌ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 2019 నాటికి హైదరాబాద్‌ శివార్లలో గూగుల్‌ ప్రాంగణం తయారుకాబోతోంది. ప్రస్తుతం ప్రైవేటు స్థలంలోనే తమ కేంద్రాన్ని ఆరంభిస్తున్న యాపిల్‌ సంస్థ ఇప్పటిదాకానైతే ప్రభుత్వం నుంచి స్థలాన్ని కోరలేదని సమాచారం. ‘‘సరికొత్త నూతన ఐటీ విధానాన్ని ఆవిష్కరించి, పెట్టుబడులను ఆకర్షిస్తున్న తరుణంలో ఇతర దేశాలను, భారత్‌లోని అనేక మెట్రోనగరాలను కూడా కాదని యాపిల్‌ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకోవటం ఎంతో గర్వకారణం. ఇది ప్రభుత్వ విధానాలకు ఎంతో ధైర్యానిస్తుంది’’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మరోవంక, యాపిల్‌ సంస్థ అధిపతి కుక్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌లతో ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన ఐటీ విధానాన్ని కేటీఆర్‌ ఆయనకు వివరించే అవకాశముంది.

  •