హైదరాబాద్‌లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
ఒకే రోజు ముగ్గురు మృతి
హైదరాబాద్, జనవరి20(జనంసాక్షి): స్వైన్‌ఫ్లూ హైదరాబాద్‌ను వణికిస్తోంది. ఈ వ్యాధితో ఈరోజు హైదరాబాద్‌లో మరో ముగ్గురు మృతి చెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో
ఇద్దరు, గాంధీ ఆస్పత్రిలో ఒకరు మృతి చెందారు. జంటనగరాల్లో తాజాగా 50 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో పది మంది మృతి చెందారు. రోజురోజుకు ఈ వ్యాధి సోకినవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితులలో స్వైన్‌ఫ్లూను అరికట్టడానికి ఇండియన్ మెడికల్
అసోసియేషన్ కొన్నిమార్గదర్శకాలను విడుదల చేసింది. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే డాక్టర్లని సంప్రదించాలని కోరింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి స్వైన్‌ఫ్లూ వ్యాధికి లక్ష్యణాలుగా పేర్కొంది. మరోవైపు స్వైన్ ఫ్లూపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి
రాజయ్య చెప్తున్నారు. వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఎక్కడైనా ఇబ్బంధులుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.