హైదరాబాద్‌లో విహంగ వీక్షణం

1

– హెలిటూరిజం సేవలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి1(జనంసాక్షి): న్యూయార్క్‌, లండన్‌ నగరాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ పర్యాటకులకు విహంగ వీక్షణం చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, సరస్సు తదితరాలను తిలకించే కార్యక్రమాన్ని

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు. ‘హెలిటూరిజం ఇన్‌ హైదరాబాద్‌’ అనే పేరుతో తెలంగాణ పర్యాటక శాఖ – ఇండివెల్‌ ఏవియేషన్‌ సంస్థ సంయుక్తంగా ఈ సేవలను అందిస్తున్నాయి. హెలికాప్టర్‌లో ఒకేసారి నలుగురు ప్రయాణించవచ్చు. ఒక్కొక్కరికి రూ.3,499 ఛార్జి వసూలు చేస్తారు.

దీంతో హైదరాబాద్‌ టూరిజం చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. భాగ్యనగర సొయగాలను విహంగ వీక్షణం ద్వారా చూసే అవకాశం ప్రజలకు దక్కింది.  నెక్లెస్‌ రోడ్డులో తెలంగాణ పర్యాటక శాఖ-ఇండివెల్‌ ఏవియేషన్‌ సంస్థ సంయుక్తంగా చేపట్టిన హెలీ టూరిజం ఇన్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టూరిజం మంత్రి చందూలాల్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేర్వారం రాములు, టూరిజం కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హెలీ టూరిజం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించు కోవాలని కోరారు. దీనిని ఏర్పాటు చేసినందుకు పర్యాటకశాఖను అభినందించారు. ఒక్కొక్కరికి రూ.3,499 వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. కోటికిపైగా ఉన్న హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. కాగా, హెలీ టూరిజం హెలికాప్టర్‌లో నలుగురు కూర్చునే అవకాశం ఉంటుంది. రోజుకు పది నుంచి పదిహేను ట్రిప్పులు తిప్పుతారు.