హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు

కిరాతకంగా హత్యలు చేస్తున్నా చేష్టలుడిగిన పోలీసులు
ఫ్యాక్షన్‌ తరహా మర్డర్లపై ప్రజల్లో ఆందోళన
హైదరాబాద్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి):  నగరంలో నడిరోడ్లపై జరుగుతన్న వరుస హత్యలు ప్రజలను ఆందోళనలకు  గురి చేస్తున్నాయి. పట్టపగలు అన్న తేతా లేకుండా సీమ ఫ్యాక్షన్‌ తలపించేలా హత్యలు సాగుతున్నాయి. అత్తాపూర్‌ ఘటన మరువక ముందే.. అలాంటి తరహా హత్యలే నగరంలో జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని ఓ వైపు ప్రభుత్వం చెబుఉతన్న వారుస ఘటనలతో నగర ప్రజలు వణికి పోతున్నారు.  ఉన్మాదంతో జనం మధ్యే నిందితులు రెచ్చిపోతున్నారు. నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. బీడీ రెడ్డి గార్డెన్‌ దగ్గర ఓ వ్యక్తిని దుండగుడు వేటకొడవలితో నరికి చంపేశాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కలిసి కారులో వచ్చారని… వాగ్వాదం తర్వాత హత్య జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌గా గుర్తించారు. ఇదిలా ఉంటే అర్ధరాత్రి విూర్‌చౌక్‌ పోలీస్టేషన్‌ పరిధిలో దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చుట్టూ జనాలు.. సవిూపంలో పోలీసులు ఉన్నా కాపాడే ప్రయత్నం చేయకపోవడంతో ఒక నిండు ప్రాణం బలైపోయింది. చంచల్‌గూడకు చెందిన ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ షాకిర్‌ ఖురేషీ (30).. అతని స్నేహితుడు అబ్దుల్‌ ఖాజా (29) మధ్య ఆటో విషయమై వివాదం చెలరేగింది. ఖురేషి ఆటోను అకీల్‌ అనే
వ్యక్తికి ఖాజా ఇవ్వడంతో గొడవ మొదలైంది. బుధవారం సాయంత్రం నయాపూల్‌ ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఇద్దరూ ఘర్షణ పడ్డారు. తన ఆటో వేరేవాళ్లకు ఎలా ఇస్తావని ఖురేషీ తీవ్రంగా దూషించడంతో కోపంతో ఊగిపోయిన ఖాజా తన వద్ద ఉన్న కత్తితో ఖురేషి మెడపై దాడి చేశాడు. నిస్సహాయస్థితిలో పడి ఉన్న ఖురేషీపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేస్తున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అందరూ చూస్తుండగానే పదిసార్లు కత్తితో మెడ, తల, గొంతుపై నరకడంతో తీవ్ర గాయాలపాలైన ఖురేషీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య తర్వాత కూడా నిందితుడు పారిపోకుండా అక్కడే కూర్చున్నాడు. కాసేపటికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిని, చెల్లిని అసభ్యకరంగా దూషించడమే కాకుండా, వారిపై లైంగిక దాడి చేస్తానని చెప్పడంతోనే తాను హతమార్చినట్లు నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఖురేషీ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే బీఎన్‌రెడ్డికి సవిూపంలో మరో హత్య కలకలం సృష్టిస్తోంది. వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ఓ వృద్ధుడు అనుమానాస్పద మృతికి గురయ్యాడు. ముఖంపై గాయాలు కావడంతో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకోవడం నగర ప్రజలను కలవరపరుస్తోంది.