హైదరాబాద్‌ సమస్యలపై కేటీఆర్‌ సమీక్ష

3

హైదరాబాద్‌,ఆగస్టు 9(జనంసాక్షి):  హైదరాబాద్‌లో బస్‌ షెల్టర్లు, స్వచ్ఛ హైదరాబాద్‌, డిజిటల్‌ ఇంటి నంబర్ల ప్రాజెక్టుపై జీహెచ్‌ఎంసీ, ఆస్కి అధికారులు, ప్రతినిధులతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. నగరంలో చేసిన ప్రాథమిక సర్వే వివరాలను ఆస్కి మంత్రికి వివరించింది. వివిధ అంశాలతో పాటు నగరంలో రోడ్లు, చెత్త సేకరణ తదితర అంశాలను సవిూక్షించారు. మొదటి దశలో 800 చోట్ల కొత్త బస్టాపుల నిర్మాణంతో పాటు నాలుగు రకాలుగా బస్టాపులు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. రోజువారీ చెత్తను నేరుగా సేకరించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డిజిటల్‌ ఇంటి నంబర్ల ఏర్పాటు పక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. ఇదిలావుంటే నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జీరో డిశ్చార్జ్‌ కాలుష్యంతో ఫార్మాసిటీ నిర్మిస్తున్నామన్నారు. త్వరలో పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు