హోరెత్తుతున్న ఓరుగల్లు ఉప ఎన్నిక ప్రచారం
వరంగల్ :
వరంగల్‌లో టిఆర్‌ఎస్‌దే గెలుపు
ఓరుగల్లు ఉప ఎన్నికలో గెలుపు తప్పనిసరి అని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. యంత్రాంగాన్ని భారీగా మోహరించింది. ఇప్పటికే నియోజకవర్గానికి ఓ మంత్రిని ఇంచార్జిగా పెట్టి.. తత్కాల్ వ్యూహరచనలతో దూసుకు వెళుతోంది. ఓవైపు.. ప్రచార సభల్లో పాల్గొంటూనే.. ఇతర పార్టీల నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ.. బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారానికి ఇక నాలుగు రోజులే గడువు ఉండడంతో.. ఇప్పుడు ఆ పార్టీ కూడా బహిరంగ సభలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రప్పించి మరింత మంది ఓటర్లను ఆకట్టుకోవాలని సన్నాహాలు చేస్తోంది.ఎన్‌డీఏ అభ్యర్థి దేవయ్య.. బీజేపీ-టీడీపీల ఉమ్మడి అభ్యర్థే.. కానీ ప్రచారంలో.. ఆయన ఒంటరి పోరే సాగిస్తున్నారు. సొంతపార్టీ నేతలు, కలసిరాని మిత్రపక్షమూ.. ప్రచారంలో దేవయ్యను వెనుకబడేలా చేశాయి. దీంతో దేవయ్య ఇప్పుడిక బహిరంగ సభలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. వచ్చే నాలుగు రోజులూ పూర్తిగా బహిరంగ సభల ద్వారానే ఓట్లు అభ్యర్థించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా.. ఏడు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ప్లాన్ చేశారు. కేంద్రమంత్రులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే.. అభ్యర్థిని ఖరారు చేసిన వామపక్షాలు.. ఉమ్మడి అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ తరఫున ప్రచారాన్ని హోరెత్తించాయి. నియోజకవర్గాల్లోని వామపక్ష నేతలతో కలిసి ప్రచారం ముగించారు. మండల స్థాయుల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ ఎన్నికల చిహ్నం.. గ్యాస్ సిలిండర్‌ను.. ప్రజల్లోకి చేర్చేందుకు వినూత్నంగా ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు ప్రచారానికి గడువు ముగిస్తున్న తరుణంలో.. ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు.. మరిన్ని బహిరంగ సభలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.అటు వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కూడా.. ఇప్పుడు బహిరంగ సభలపై దృష్టి సారించారు. ఇప్పటివరకూ పార్లమెంటు సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో రోజాతో రోడ్‌షోలు నిర్వహింప చేశారు. సోమవారం నుంచి.. పార్లమెంటు సెగ్మెంట్‌లోని వీలైనన్ని మండలాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఓట్లు అభ్యర్థించాలని సూర్యప్రకాశ్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి బహిరంగసభలోనూ.. పార్టీ అధ్యక్షుడు జగన్‌తో మాట్లాడింప చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.