సెప్టెంబర్‌ 1 నుంచి ముల్కీ అమరుల వారోత్సవాలు


7న శాంతిర్యాలీ
సమైక్య ఉద్యమం వెనుక సీఎం, డీజీపీ
ప్రక్రియ వేగవంతం చేయకపోతే అనర్థాలు : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టే వరకూ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. తక్షణమే విభజన ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు ఉద్ధృతం చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చే నెల 7న హైదరాబాద్‌లో శాంతిర్యాలీ నిర్వహించనున్నట్లు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ప్రకటించారు. ర్యాలీలో వేలాది మంది తెలంగాణ వాదులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగళవారం కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీఎన్జీవో భవన్‌లో జరిగిన ఈ భేటీలో తెలంగాణ ప్రకటన, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిం చారు. భేటీ ముగిసిన అనంతరం కోదండరామ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పోరాటం కొనసాగి స్తామన్నారు. సెప్టెంబర్‌ 7న సిటీ కాలేజీ ఇందిరాపార్కు వరకూ భారీ ర్యాలీ నిర్వహి స్తామని తెలిపారు. ర్యాలీలో వేలాది మంది పాల్గొని తెలంగాణ ఆకాంక్షను మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి 7వరకు ముల్కీ వారంగా ప్రకటిస్తామ్నారు.
ఆలస్యం చేస్తే పరిస్థితి విషమం
ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఆలస్యం అయ్యే కొద్ది పరిస్థితి విషమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రజల మధ్య వైషమ్మాలు పెరిగి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని హెచ్చరించారు.
సమైక్య ఉద్యమం వెనుక సీఎం, డీజీపీ
సమైక్య ఉద్యమం వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. బాధ్యతా యుతమైన పదవుల్లో ఉన్న వారే ఆందోళనలు రేకెత్తిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాలసిందిపోయి ఉద్యోగులను, ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సీఎం, డీజీపీ తమ పదవుల్లో కొనసాగేందుకు అనర్హులు అని అన్నారు. సీఎం కిరణ్‌్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు కోదండరాం తెలిపారు. డీజీపీ తెలంగాణ ప్రజలకు రక్షణ ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం వారిపై దాడులు జరుగుతుంటే.. పోలీసులు, ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు.
సీమాంధ్ర మీడియాపై కోదండరామ్‌ మండిపడ్డారు. విూడియా పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు. సీమాంధ్ర విూడియా వాస్తవాలు చూపిస్తే బాగుటుందని పేర్కొన్నారు. విద్యుత్‌ సౌధాలో సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు దాడి చేయలేదని, కానీ ఓ ప్రాంతం విూడియా దాడి చేసినట్లు దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. విద్యుత్‌ సౌధాలో ఉన్న వాచ్‌మన్‌పై దాడి చేసింది సీమాంధ్ర ఉద్యగోలేనని స్పష్టం చేశారు. మీడియా వాస్తవాలు చూపకుండా ప్రజలను మభ్యపెట్టేలా కథనాలు ప్రసారం చేయడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘నిబంధనలు’ పాటించిన మీడియాకు.. సీమాంధ్ర ఉద్యమ సమయంలో ఆ నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు.