11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం

  • హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్… కేంద్ర సహాయమంత్రులు అనుప్రియ పాటిల్, జయంత్ చౌదరి, రాందాస్ అథవాలే, ఎంపీ ప్రపుల్ పటేల్ హాజరుకానున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.

ఇక, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకకు హాజరవుతున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, రజనీకాంత్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాల వారు అమరావతి చేరుకున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖుల రాక దృష్ట్యా గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కేసరపల్లి, పరిసర ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక ప్రాంతాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. విజయవాడ, గన్నవరం, కృష్ణా నది కరకట్ట ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, విజయవాడలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.