12న కేబినెట్‌ ముందుకు తెలంగాణ బిల్లు


విభజనపై నిర్ణయమైపోయింది
సీమాంధ్రలో ప్రజల హక్కులను కాపాడ్తాం
కేంద్ర మంత్రి బలరాంనాయక్‌
తిరుపతి, ఆగస్టు 31 (జనంసాక్షి) :
రాష్ట్ర విభజన కార్యక్రమం పూర్తయిపోయిందని, తర్వాత జరుగాల్సిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేందుకు సీమాంధ్రులు సహకరించాలని కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ పేర్కొన్నారు. తిరుమలకు వచ్చిన బలరాంనాయక్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 12వ తేదీనజరిగే కేంద్ర కేబినెట్‌ సమావేశం ముందుకు వస్తుందన్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని మంత్రి ప్రకటించారు. కేబినెట్‌లో మంత్రులు ఇప్పటికే చర్చించినందున కేబినెట్‌ ఆమోదం కూడా క్షణాల్లోనే జరిగిపోతుందన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచననే కేంద్రం చర్చిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడివారైనా ఉండొచ్చన్నారు. సీమాంధ్ర ప్రజలకు, నేతలకు వ్యాపారులకు ఉద్యోగులకు హైదరాబాద్‌లో పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. సీమాంధ్రలో రాజధాని, నీళ్లు, నిధులు, ఉద్యోగాలపై చర్యలు తీసుకునే పనిలోనే కేంద్రం ఉందన్నారు. నేను తిప్పితిప్పి చెప్పడం లేదని, స్టేట్‌ ఫార్వర్డ్‌గా చెప్పే మనస్తత్వం తనదన్నారు. విడిపోయిన తర్వాత కూడా కలిసి ఉండాల్సిందేనన్నారు. తనకు కడపలో, గుంటూరులో, అనంతపూరులో బంధువులున్నారన్నారు. ఎవరైతే వెళ్లిపోవాలంటారో వాళ్లకు వ్యతిరేకంగా తను ఉంటానన్నారు. సీమాంధ్ర ప్రజలు, ఏపిఎన్జీఓలు ఇప్పటికైనా సంయమనం పాటించి శాంతియుతంగా విడిపోయేందుకు సహకరించాలని కోరారు.