123జీవోపై హైకోర్టులో సర్కారుకు ఊరట
హైదరాబాద్,ఆగస్టు 9(జనంసాక్షి): భూసేకరణ జీవో 123 రద్దు అంశంపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం చేసుకున్న అప్పీల్‌పై మంగలవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిర్వాసితులకు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారికి ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయోజనాలు కల్పించే అంశంపై జీవో జారీ చేస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జీవో జారీ చేసి దాని ప్రతిని తమకు సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 123 జీవోను కొట్టివేస్తూ జారీ అయిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. సవరించిన జీవోను పూర్తిగా పరిశీలించిన తర్వాత గురువారం పూర్తిస్థాయిలో తీర్పు ఇస్తామని పేర్కొంది.ప్రాజెక్టులకు సత్వర భూసేకరణ కోసం తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 123ని కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది. వ్యవసాయ కూలీల ఉపాధిపై రూపొందించిన కొత్త జీవోను తన ముందు ఉంచాలని, అంత వరకు సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తున్నట్లు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదావేసింది. డివిజన్ బెంచ్ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. భూ నిర్వాసితులు, రైతు కూలీల రక్షణ కోసం తీసుకునే చర్యలను అఫిడవిట్ ద్వారా కోర్టుకు సమర్పించింది. నిబంధనల ప్రకారమే నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నామని, వ్యవసాయ కూలీలను ఆదుకుంటామని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో సంబంధిత జీవోను తన ముందు ఉంచాలని ఆదేశించడంతోపాటు, సింగిల్ బెంచ్ తీర్పును నిలుపుదల చేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.123 జీవోపై కొందరు రైతులు, నిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. కేంద్ర ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టం – 2013ను తోసిరాజనేలా జారీ చేసిన 123 జీవో చెల్లదని జులై 3న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీలుకు వెళ్లిన తెంలంగాణ ప్రభుత్వం.. భూమిలేని నిరుపేదలకు సైతం పునరావాసం, ప్రయోజనాలు కల్పిస్తున్నామని, భూసేకరణ చట్టం కంటే 123 జీవో ద్వారానే నిర్వాసితులకు మేలు చేస్తామని తెలిపింది.