123 జీవో చెల్లదు
– 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయండి
– హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్,ఆగస్టు 3(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మల్లన్న సాగర్‌తో పాటు ఇతర చోట్ల భూసేకరణకు తీసుకుని వచ్చిన 123 జీవోను హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 123ను హైకోర్టు బుధవారం రద్దు చేసింది. 2013 భూ సేకరణ చట్టం ఉండగా జీవో నెంబర్ 123 ప్రకారం ఎలా భూసేకరణ చేస్తారని హైకోర్టు ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ను ప్రశ్నించింది. ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి నేరుగా భూముల కొనుగోలుకు ప్రభుత్వం 123 జీవోను తెచ్చిన విషయం తెలిసిందే. నిర్వాసితులకు పరిహారం, చెల్లింపులపై గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. జీవోను సవాల్ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిగిన హైకోర్టు జీవో నెంబర్ 123ను కొట్టేసింది. ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ జీవోలు 123, 124లను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన 20మంది భూ నిర్వాసితులు వేసిన పిటిషన్‌పై ఈ మేరకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవించింది. అనంతరం జీవోలు 123, 124 కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుంటే ప్రధానంగా మల్లన్న సాగర్ విషయంలో గత కొంతకాలంగా ఆందోళన సాగుతోంది. రైతలకు భూసేకరన చట్టం ప్రకారం పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్,టిడిపి, వామపక్ష పార్టీలతో సహా పొలిటికల్ జెఎసి కూడా దీనిని వ్యతిరేకించింది.
జీవోలు కొట్టేస్తారని ఊహించాం: కోదండరామ్
బలవంతపు భూసేకరణకు సాధనంగా ప్రభుత్వం 123 జీవోను ఉపయోగించుకుందని, ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా జీవోలు తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించామని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. 2013 భూసేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 123 జీవోతో అన్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలని కోదండరాం సూచించారు. ఈ జీవోను హైకోర్టు కొట్టేయడంపై ఆయన స్పందించారు. రైతుల ప్రయోజనాలు ముఖ్యం గనుక ఆ మేరకు నడచుకోవాలన్నారు.