18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి… – ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా


కామారెడ్డి ప్రతినిధి నవంబర్15 (జనంసాక్షి);
ఎన్నికల సమ్మర్ రివిజన్లో మార్పు వచ్చిందని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఓటరు నమోదు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జనవరి 1,2023 వరకు 18 ఏళ్లు నిండిన వారు, ఏప్రిల్ 1,2023 వరకు 18 ఏళ్ల నిండిన వారు, జులై 1,2023 వరకు 18 ఏళ్ల నిండిన వారు, అక్టోబర్ 1,2023 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 1,2023 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. అర్హత ఉన్న వారందరిని వంద శాతం నమోదు చేయాలని కోరారు. బూతు లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. ప్రతి రాజకీయ పార్టీ ఏజెంటును ఏర్పాటు చేసుకొని కొత్త ఓటర్ల నమోదుకు సహకారం అందించాలని చెప్పారు. జనాభాకు అనుగుణంగా ఓటర్ల నమోదు ఉండాలన్నారు. 90 ఏళ్లు నిండిన ఓటర్లను గుర్తించాలని పేర్కొన్నారు.
ఓటర్ల నమోదు పగడ్బందీగా చేపట్టాలని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓటర్లు, ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఫామ్ 6 బి నింపి ఆధార్ నకలు స్వచ్ఛందంగా అందజేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో మృతి చెందిన వారి పేర్లు లేకుండా రాజకీయ పార్టీల నాయకులు చూడాలన్నారు. దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల పేర్లు ఉంటే వాటిని తొలగించి, వారి నివాస గృహాలకు అందుబాటులో ఉండే పోలింగ్ కేంద్రాల్లో ఉండే విధంగా నమోదు చేయించే విధంగా చూసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలు, స్వయం సహాయక సంఘాల మహిళలను 100% ఓటర్లుగా నమోదు చేయించాలని పేర్కొన్నారు. దివ్యాంగులు ఉంటే వారికి ఏ రకమైన వైకల్యం ముందు ఓటరు జాబితాలో నమోదు చేయించాలని సూచించారు. తప్పులు ఉంటే సవరణ చేయించుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శ్రీను, రాజా గౌడ్, ఎన్నికల సూపర్డెంట్ సాయి భుజంగరావు, ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్లు శ్రావణి, ఇందిరా ప్రియదర్శిని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.