జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావం

అధికారికంగా ప్రకటించిన హోం శాఖ
29వ రాష్ట్రంగా తెలంగాణ
న్యూఢిల్లీ, మార్చి 4 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా (అపాయింటెడ్‌ డే) జూన్‌ 2ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్‌ 2 నుంచి మనుగడలోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. అదే తేదీన అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా మనుగడలోకి వస్తుందని ప్రకటించింది. జూన్‌ 2వ తేదీ రెండు రాష్ట్రాల ఆవిర్భావం దినోత్సవంగా ఉంటుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అపాయింటెడ్‌ డేను ప్రకటించడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తయినట్టే. 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల అనంతరం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు అధికారాన్ని చేపడుతాయి. రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలు అపాయింటెడ్‌ డే నుంచి అమల్లోకి వస్తాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ జులై 30న నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అంతక్రితమే కేంద్రం తెలంగాణపై సంప్రదింపులు నిర్వహించిన నేపథ్యంలో వివిధ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. చివరగా కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై రాజ్యాంగపరమైన ప్రక్రియకు పూనుకుంది. ఈలోగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలే అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టడంతో వారి అభిప్రాయ సేకరణకు ఆంటోనీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబర్‌ మూడో తేదీన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అదే నెల ఎనిమిదో తేదీన ఆంధ్రప్రదేశ్‌ పనర్వ్యస్థీకరణ సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేసింది. ఆ మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అధ్యక్షత జీవోఎం తొలి భేటీ జరిగింది. డిసెంబర్‌ 4న జీవోఎం తన కసరత్తు పూర్తి చేసి కేంద్రానికి నివేదిక అందజేయగా ఐదో తేదీన కేంద్ర కేబినెట్‌ జీవోఎం నివేదికను ఆమోదించింది. ఆరో తేదీన రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును కేంద్రం పంపింది. ఆయన ముసాయిదాపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, కౌన్సిల్‌ అభిప్రాయాలను చెప్పేందుకు ఆరు వారాల గడువిస్తూ డిసెంబర్‌ 12న రాష్ట్రానికి పంపారు. డిసెంబర్‌ 16న బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సీమాంధ్రుల అనవసర ఆందోళనలతో సభా కాలం వృథా అయింది. బిల్లుపై చర్చకు రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు రాష్ట్రపతి గడువు డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీకి పొడిగించారు. ఫిబ్రవరి 3న కేంద్రానికి చేరిన బిల్లును 7న కేబినెట్‌ ఆమోదించింది. 10 రాష్ట్రపతి తెలంగాణ బిల్లుపై సంతకం చేశారు. లోక్‌సభ గతనెల 18న, రాజ్యసభ 20న తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈనెల 1న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తెలంగాణ బిల్లుపై రాజముద్ర వేశారు. మంగళవారం అపాయింటెడ్‌ డేను ప్రకటించడంతో తెలంగాణ ప్రక్రియ పరిసమాప్తమైంది.