20 గ్రామాలకు 26గంటల విద్యుత్‌ కోత?

– కేంద్ర హోంమంత్రి హెలికాప్టర్‌ కోసం 20 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత‌

(జ‌నం సాక్షి):భోపాల్‌()()() ::::::::::::: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెలికాప్టర్‌ కోసం ఏకంగా 20 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు అధికారులు. మండే ఎండల్లో విద్యుత్‌ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాంతా ప్రాంతంలో చోటుచేసుకుంది.

సాంతాలోని కోఠినగర్‌ పంచాయతీలో ఆదివారం రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటించనున్నారు. హోంమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే హోంమంత్రి హెలికాప్టర్‌ సురక్షితంగా దిగేందుకు వీలుగా సాంతా పరిధిలోని దాదాపు 20 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆ ప్రాంతం గుండా హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు వెళ్తున్నాయని.. అందుకే శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకూ విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పత్రికల్లో ప్రకటన కూడా జారీ చేశారు.

దీంతో ఆ గ్రామాల ప్రజలు మండు వేసవిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగేందుకు నీరు లేక.. మరోవైపు ఉక్కపోతతో తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ ప్రాంతంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని.. చిన్నపిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు.

మధ్యప్రదేశ్‌లో వీఐపీల పర్యటనల నేపథ్యంలో స్థానికులను ఇబ్బందులకు గురిచేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రధాని ర్యాలీ కోసం సెహర్‌ ప్రాంతంలోని ఓ రైతు పంటను బలవంతంగా అధికారులు కోయించారు.