20 రోజుల్లో కేబినెట్‌ ముందుకు తెలంగాణ తీర్మానం


నోట్‌ తయారీలో హోంశాఖ
వెనువెంటనే న్యాయశాఖకు.. ఆ తర్వాత అసెంబ్లీకి
హోం మంత్రి షిండే విస్పష్ట ప్రకటన
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) :
తెలంగాణపై వెనక్కు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నా.. ఉద్యోగులు రోడ్డెక్కినా.. తమ నిర్ణయంలో మార్పు లేదని ఘంటాపథంగా చెప్పింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేందుకు తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానాన్ని త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్‌ ముందుకు తీసుకురానున్నట్లు కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. తెలంగాణ తీర్మానం పరిశీలన కోసం న్యాయ శాఖకు పంపుతామని చెప్పారు. సోమవారం షిండే ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణ తీర్మానాన్ని రూపొందించే పనిలో ఉన్నామని.. 20 రోజుల్లో తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్‌ ముందుకు తీసుకువస్తామన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. అంతా సవ్యంగా సాగితే డిసెంబర్‌ కల్లా తెలంగాణ కల సాకారం కానుంది. జూలై 31న సీడబ్ల్యూసీ, యూపీఏ తెలంగాణకు అనుకూలంగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను అంతర్గతంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ¬ం శాఖ తెలంగాణపై క్యాబినెట్‌ నోట్‌ రూపకల్పనలో నిమగ్నమైంది. ప్రాథమికంగా ఎనిమిది పేజీల నోట్‌ రూపొందించినట్లు తెలిసినప్పటికీ, మొత్తంగా 300 పేజీలకు పైగా నోట్‌ తయారైనట్లు సమాచారం. అయితే, అందులోని సారాంశాన్ని కలిపి 8 పేజీలకు కుదించినట్లు తెలిసింది. ¬ం శాఖ వర్గాలు అత్యంత రహస్యంగా, అత్యంత జాగ్రత్తతో నోట్‌ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ¬ం శాఖ రాజ్యాంగ ప్రక్రియలో తలమునకలయ్యాయి. శుక్రవారంతో పార్లమెంట్‌ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో అది మరింత వేగం పుంజుకోనుంది. ఈ వారంలో జరిగే కేంద్ర మంత్రి మండలి ముందుకు కేబినెట్‌ నోట్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ రూపొందించిన ఈ నోట్‌ను క్యాబినెట్‌ యథాతథంగా ఆమోదించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియను పర్యవేక్షించేందుకు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీకి రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీయే నేతృత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అలాగే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపించి, అభిప్రాయం కోరనుంది. అది ఓడినా, గెలిచినా సంబంధం లేకుండా రాష్ట్ర విభజన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో అసెంబ్లీ అభిప్రాయం సేకరించలేదని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. నవంబర్‌ చివరికల్లా ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.