గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని… “మోడీ గో బ్యాక్”అంటూ నల్ల బెలూన్లతో నిరసన…

.

కరీంనగర్ టౌన్ నవంబర్ 12(జనం సాక్షి)
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నందున కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు,గిరిజన వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శని వారం కరీంనగర్ తెలంగాణ చౌక్లో నల్ల రిబ్బన్లు, నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ బీమా సాహెబ్, చింతకుంట ఎంపీటీసీ భూక్య తిరుపతి నాయక్ లు మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా గిరిజనులను మోసం చేసిందని ఆరోపించారు. అదే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి తెలంగాణలో ఏర్పాటు చేయకపోవడం తెలంగాణ పట్ల గిరిజన సమాజం పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్ర వివక్ష పాటిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 ఎకరాలు గిరిజన యూనివర్సిటీనీ ఏర్పాటు చేయాలని భూమిని కేంద్రానికి అప్పగించి మూడేళ్లు కావస్తున్న ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయడంలో లేదో ప్రధాని నరేంద్ర మోడీ నేటి రామగుండం బహిరంగ సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో కోట్లాదిమంది ఆదివాసి గిరిజనులు అడవులపై ఆధారపడి జీవిస్తున్న వారిని అడవుల నుండి బలవంతంగా గెంటివేసే విధంగా అడవులను,అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అటవీ సంరక్షణ నియమాలు – 2022 పేరుతో పార్లమెంటులో చట్టం చేయబోతుందని అన్నారు. చట్టం ఆమోదం పొందితే శతాబ్దాలుగా అడవుల్లో పోడు భూములను సాగు చేస్తున్న ఆదివాసి గిరిజనులు భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో ఉత్పత్తులను సేకరించి జీవనం సాగిస్తున్న కోట్లాదిమంది గిరిజనులు ఉపాధికి దూరమవుతారని అన్నారు. అటవీ సంరక్షణ నియమాలు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా లేదా అనేది నరేంద్ర మోడీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.దేశంలో గిరిజనుల జనాభా నిష్పత్తి 7 నుండి 10 శాతానికి పెరిగినందున కేంద్ర ప్రభుత్వం 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రిజర్వేషన్ పెంచాలని టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి చేసిన బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ ఎందుకు పెంచడం లేదు చెప్పాలనీ డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంపుదలపై ఉన్న చిత్తశుద్ధి రాజ్యాంగ హక్కుగా ఉన్న దళితులు గిరిజనుల రిజర్వేషన్ పెంపుదల లో లేదని విమర్శించారు. దేశంలో లక్షలాదిమంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వ రంగ సంస్థలను ఆరు చౌకగా కార్పోరేట్ల అమ్మడం వలన కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాలరాస్తుందని విమర్శించారు.

*ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నేతలు గుగులోతు రాజు నాయక్, జి. తిరుపతి, ధరావత్ తిరుపతి నాయక్ బోడ మోహన్ నాయక్ ,నరేష్ పటేల్, మున్నా రవి నాయక్,సంతోష్ నాయక్ ,భాస్కర్ నాయక్ ,శ్రీనివాస్ నాయక్, రాజ్ కుమార్ ,తెలంగాణ చౌకి ఇంచార్జి జి ఎస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.