పీఎస్‌ఎల్వీ సీ-23 ప్రయోగానికి సర్వం సిద్ధం
ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోట చేరుకున్న ప్రధాని
నెల్లూరు, జూన్ 29 (జనంసాక్షి) :
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ-23 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి సోమవారం ఉదయం పీఎస్‌ఎల్వీ సీ -23ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం శ్రీహరికోటకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నరేంద్రమోడీకి తమిళనాడు గవర్నర్ రోషయ్య, ముఖ్యమంత్రి జయలలిత ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు చేరుకున్నారు. శ్రీహరికోటలో మోడీకి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్
తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా భాస్కర గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రయోగం గురించి శాస్త్రవేత్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షార్‌లోని రెండు రాకెట్ ప్రయోగ వేదికలను ఆయన పరిశీలించారు. పీసీఎల్వీ సీ-23 ప్రయోగం సందర్భంగా శ్రీహరికోటలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 9.49 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-23ని నింగిలోకి పంపుతారు. ఈ రాకెట్ ప్రయోగ కౌంట్‌డౌన్‌ను శనివారం ఉదయం 8.52 గంటలకు ప్రారంభించారు. మొదటి ప్రయోగ వేదికపై నాలుగు దశలతో కూడిన రాకెట్‌లో ద్రవ ఇంధనం, గ్యాస్ నింపే పనులను పూర్తి చేశారు. నాల్గో దశకు 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. ఆదివారం రాత్రి తదుపరి దశల్లో గ్యాస్ నింపే పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.