తాండూరు గడ్డపై బిఎస్పి జెండా ఎగురవేస్తాం
తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుంది.
తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తుంది.
రాబోయే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ.
తాండూరు కంది ప్రపంచ వ్యాప్త ఖ్యాతి.
రాష్ట్ర బిఎస్పిపార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
తాండూర్ సెప్టెంబర్ 16 (జనంసాక్షి) తాండూరు గడ్డపై భౌజన సమాజ్ పార్టీ జెండా ఎగురవేస్తామని తెలంగాణలో బహుజన పాలన రాబోతుందని రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం తాండూర్ లో జరిగిన కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి ఎస్విఆర్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో రాజ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, ప్రజాస్వామిక వాదుల ఫోన్లు టాపింగ్ చేసి అక్రమ అరెస్టులతో నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో దగాకోరు పాలన నడుస్తుందని విమర్శించారు. ప్రభుత్వ భూములను అసైన్ భూములను కబ్జా చేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 2017 జూన్ 11వ తేదీన ప్రారంభించిన ఇప్పటివరకు పూర్తి చేయలేదని ఎన్నికల సమయంలో హడావిడిగా ప్రారంభిస్తున్నారని అన్నారు. తెలంగాణలో నిర్బంధ పరిస్థితులలో ప్రజల జీవనం కొనసాగుతుందని అంగన్వాడీ టీచర్లు సర్వ శిక్ష అభియాన్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టారని అన్నారు. హోంగార్డులు ప్రతి నెల ఒకటో తేదీన వేతనం చెల్లించాలని సమ్మె చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్న కేసీఆర్ పరిపాలనను రద్దు చేసే సమయం ఆసన్నమైందని అన్నారు. దొరల పాలనను అంతమొందించాలని దళిత బంధు బీసీ బందు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ధనార్జన దేంగా సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని అన్నారు. గ్రూప్ వన్ లో అక్రమాలు జరిగాయి అన్నారు కేటీఆర్ కవిత మంత్రి హరీష్ రావుల కాల్ రికార్డులను బయటపెడితే అక్రమాలు బయటపడతాయని అన్నారు.రెడ్ల పాలనను అంతమందించి తాండూర్లో నీలి జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బీజేపీతో కొమ్ముకై కేసీఆర్ దగ్గర మార్కులు పొంది టికెట్ పొందారని పోలీసులను తిట్టిన మహేందర్ రెడ్డి కి మంత్రి చేశారని అన్నారు. తాండూరు కంది ప్రపంచ వ్యాప్త ఖ్యాతిగాంచిందని తాండూరు కందిబోర్డు తీసుకువస్తామని అన్నారు. 119 స్థానాలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు. బహుజనులు అంతా ఏకమై బిఎస్పి పార్టీని ఆదరించి గెలిపించాలని మళ్లీ తాండూర్ కు విజయోత్సవ ర్యాలీకి వస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిఎస్పి స్టేట్ కోఆర్డినేటర్ ప్రభాకర్, స్టేట్ కోఆర్డినేటర్ వీరాజ్ , వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ ,తాండూర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ ,కొడంగల్ ఇన్చార్జి నర్మదా, కృష్ణమూర్తి,అసెంబ్లీ ఇన్చార్జి దొరిశెట్టి సత్యమూర్తి ,వికారాబాద్ జిల్లా మైనార్టీ నాయకులు అంజాద్ అలీ భాష, నాయకులు అరుణ్ రాజ్ ,అఖిల్ బాబా, పాండు ,కృష్ణయ్య గౌడ్, మక్సుద్, అశ్వాక్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.