మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ దోహద పడుతుంది

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు చెస్ ఎంతో దోహదపడుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణలు అన్నారు.జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్ – 9, 15 చదరంగ పోటీల విజేతలకు మెడల్స్ అందజేసి మాట్లాడారు. చెస్ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి పోటీలు ఉపకరిస్తాయని అన్నారు.ఎక్కడ ఎలాంటి పోటీలు ఉన్న చెస్ క్రీడాకారులు వెళ్లి పాల్గొని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 150 మంది క్రీడాకారులు హాజరుకాగా అండర్ 9 బాలుర విభాగంలో బి.దక్షిత్, బి.లక్షిత్, రిత్విక్, నీత్విక్, బాలికల విభాగంలో రుత్విక, హేమశ్రీ, తన్మయి, అండర్ -15 బాలుర విభాగంలో బి.హర్షిత్, గౌతమ్ కృష్ణారెడ్డి, కె.పార్ధు, సాయి శ్రీనివాసరావు, బాలికల విభాగంలో అనంతలక్ష్మి, చిద్విలాసిని, వర్షినిలు గెలుపొందారు.వీరు హైదరాబాద్, నిజామాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్ లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు సాయిలు, సహాయ కార్యదర్శి లింగారెడ్డి , కోశాధికారి వెంకట మురళి, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్చార్జి వెంపటి శబరినాథ్ తదితరులు పాల్గొన్నారు.