అంగన్వాడి సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
* టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 20 (జనం సాక్షి): రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అంగన్వాడి టీచర్లుగా,ఆయాలుగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడి సిబ్బంది న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గత పది రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి సిబ్బంది నాయకత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టిపిటిఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టేకులపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సమ్మె శిబిరాన్ని వారు సందర్శించి సంఘీభావాన్ని,మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ,అంగన్వాడి సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని,కనీస వేతనం 26వేలు ప్రకటించాలని,సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు,ఆయాలకు ఐదు లక్షలుగా ప్రకటించాలని,ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎం.రమణ పాల్గొన్నారు.