24 గంటల కరెంటు నిరూపిస్తే.. నామినేషన్‌ వెనక్కి తీసుకుంటా..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సవాల్‌
లేకపోతే ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా?
కోటి ఎకరాలకు నీళ్లిస్తే పంపుసెట్లు ఎలా పెరిగినట్టు..?
మక్తల్‌ (జనంసాక్షి):‘ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ది. 24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ చెబుతుండు. నేను సూటిగా సవాల్‌ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌స్టేషన్‌కైనా వెళదాం. నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే తాను నామినేషన్‌ ఉపసంహరించుకుంటా’నని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అలంపూర్‌, గద్వాల, మక్తల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నట్లు నిరూపించ లేకపోతే నడిగడ్డలో మీరు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి, బకాయిలు తొలగించి, కేసులు ఎత్తివేసి 18 లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంటు అందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని చెప్పుకొచ్చారు. నిజంగా కేసీఆర్‌ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఉంటే తెలంగాణలో పంపుసెట్లు 18 లక్షల నుంచి 25 లక్షలకు ఎలా పెరిగాయని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ చేసిందేమీ లేక అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తుండు.. రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్‌ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. పగవాడు ఉన్నా ఆ గుడి పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. నీలం సంజీవ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతిని చేసింది. దొరగారి దొడ్లో జీతగాడిగా బతకడమేనా వెంకట్‌ రామిరెడ్డి ఆత్మగౌరవమా అంటూ ప్రశ్నించారు. ఇదేనా నడిగడ్డ పౌరుషం ఒకసారి ఆలోచించాలని కోరుతున్నానన్నారు.
‘మీ బిడ్డగా చెబుతున్నా అధికారంలోకి రాగానే బోయలకు ఎమ్మెల్సీ ఇస్తాం. నల్లమల బిడ్డగా చెబుతున్నా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత మాది. ఇది మన పాలమూరు బిడ్డల జీవన్మరణ సమస్య ఆత్మగౌరవ సమస్య. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ను చంపేందుకు భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతున్నారు. వారి కుట్రలను తిప్పికొట్టి కాంగ్రెస్‌ ను అధికారంలోకి తీసుకురావాలి. ధరణి లేకపోయినా వైఎస్‌ హయాంలో రైతులకు ఆర్ధిక సాయం అందలేదా? ధరణి స్థానంలో మెరుగైన సాంకేతికతతో కొత్త యాప్‌ తీసుకొస్తాం రైతుల భూములు కాపాడుతాం. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ తెలంగాణలోని119 నియోజకవర్గాలలో ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా టికెట్‌ ఇవ్వలేదంటే ఆయనకు వాళ్ల ఓట్లు అక్కర్లేదన్నట్టేనా..కానీ కాంగ్రెస్‌ ముదిరాజులకు 4 టికెట్లు ఇచ్చింది. ముదిరాజులకు కాంగ్రెస్‌ సముచిత స్థానం కల్పించిందని మక్తల్‌లో రేవంత్‌ రెడ్డి అన్నారు. రెండు సార్లు అధికారం ఇస్తే లక్ష కోట్లు దోచుకున్నారు.. మూడోసారి ఇస్తే ఇంకో లక్ష కోట్లు దోచుకుంటారు.. మూడోసారి అధికారం ఇస్తే ఇంట్లో తన మనవడికి కూడా పదవి ఇచ్చుకుంటడని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గుడినీ గుడిలో లింగాన్ని మింగే వాడుంటాడని విన్నాం.. ఇప్పుడు కేసీఆర్‌ను చూస్తున్నామని చురకలు అంటించారు. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్‌.. బెల్టుషాపుల తెలంగాణ చేసిండు అని విమర్శించారు. గ్రూపులు గుంపులు పక్కనబెట్టి.. అంతా ఏకమై పాలమూరులో 14కు 14 సీట్లు గెలిపించాలని, అప్పుడే పాలమూరు జిల్లా అభివృద్ధిలో ముందుకెళుతుందని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ పరిధిలో ఆత్మకూర్‌, మక్తల్‌ రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.