27 నుంచి సీఎం ఇందిరమ్మ బాట జిల్లాలో ముఖ్యమంత్రి మూడురోజుల పర్యటన

శ్రీకాకుళం, జూలై 20 : ముఖ్యమంత్రి నాల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. ఆయన మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉంటారు. ఇందు కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు గ్రామాల్లోనే రాత్రి బస కూడా చేయనుండడంతో అధికారులు షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యరు. ఈ నెల 27,28,29 తేదీల్లో పర్యటన ఉంటుందనే భావిస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. అనుకోని పరిస్థితుల్లో కార్యక్రమం ఒక రోజు ముందుగానే ఉండొచ్చని భావిస్తున్నారు. కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌… సిపివో శివరాం నాయక్‌ను తూర్పుగోదావరి జిల్లాలో ఇందిరమ్మబాట జరిగిన తీరును తెలుసుకునేందుకు పంపారు. సీఎం పర్యటనపై కలెక్టర్‌ ఇక్కడి ఇన్నతాధికారులతో సమీక్షించారు. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 27న సీఎం ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాలకొండ ప్రాంతాల్లో పర్యటిస్తారు. రాత్రి సీతంపేటలోని ఆశ్రమ పాఠశాలలో బస చేస్తారు. 28న పాతపట్నం డిగ్రీ కళాశాలకు శంకుస్థాపనతో పాటు రూ. 53 కోట్లతో సీపీ రహదారి పనులు ప్రారంభిస్తారు. 29న బారువ, టెక్కలి తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. నరసన్నపేట సమీపంలోని తామరాపల్లి వద్ద రూ. 16 కోట్లతో నిర్మించిన 132/33కె.వి. సబ్‌స్టేషన్‌కు కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.