28లోగా గ్రామ కమిటీల ఏర్పాటు
నెల్లూరు,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఈనెల 28వతేదీలోగా టిడిపి గ్రామ కమిటీల ఏర్పాట్లు పూర్తవుతాయని టిడిపి నేతలు అన్నారు. మార్చి నెలలో మండల కమిటీలు అనంతరం జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకం ఉంటుందన్నారు.సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాట్లకు సంబంధించి ఉదయగిరి నుంచి 15 మంది తెదేపా నాయకులను కావలి నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమించడం జరిగిందన్నారు. కావలి నియోజకవర్గానికి చెందిన 15 మందిని ఉదయగిరి నియోజకవర్గానికి నియమించామన్నారు. మండలానికి ఇద్దరు చొప్పున పరిశీలకులు ఉంటారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, ఎన్నికల హావిూలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల పరిశీలకులు గొడుగుల గంగరాజు అన్నారు. గ్రామ కమిటీల ఏర్పాట్లపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. తెదేపా సంస్థాగత ఎన్నికల విధివిధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో అనేక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విడతలవారీగా రుణమాఫీ అమలు జరుపుతున్నారన్నారు. త్వరలో డ్వాక్రా, చేనేత వర్గాలకు కూడా రుణమాఫీ జరుగుతుందన్నారు. తెదేపా 52 లక్షల క్రియాశీల సభ్యత్వాలు నమోదవడం గొప్ప విషయమన్నారు.