42 ఏళ్ల తర్వాత కారు దొరికింది

వాషింగ్టన్‌, జూలై 13 : యుఎస్‌, టెక్సాస్‌లోని ఒక పెద్దమనిషికి పోగొట్టుకున్న తన కారు 42 సంవత్సరాల తర్వాత దొరికింది. ఇందుకు పోలీసులకు ఇంటర్నేట్‌కు కృతజ్ఞతలు అని బాబ్‌ రస్సెల్‌ చెప్పారు. 1967లో ఆయన ఆస్టిన్‌ హీలే కారును ఫిలడెల్ఫియా అపార్టుమెంట్‌ వద్ద నిలిపి ఉంచగా ఎవరో దొంగిలించారు. టెంపుల్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ విద్యార్థిగా ఉండగా తన కాబోయే భార్యతో కలిసి వచ్చినప్పుడు బ్రిటిష్‌ తయారీ అయిన ఆ కారు మాయమైంది. అప్పటి నుంచి ఆయన తన కారుకోసం వెదుకుతూనే ఉన్నారు. ఒక సారి వాషింగ్టన్‌ వెళ్లినప్పుడు ఆయన అక్కడ నిలిపి ఉంచిన ఒక ఆస్టిన్‌ హీలే కారును గమనించారు. కాని దానిపై తన కారు గుర్తులు కనిపించలేదు. ఇటీవల ఇంటర్నెట్‌ మార్కెటింగ్‌ సైట్‌ ఇ-టేలో ఆయన అదృష్టం పండింది. లాస్‌ ఏంజిలిస్‌ కారు డీలరు వేలంలో ఒక కారు పెట్టాడు. 19,700 డాలర్ల ధర పలికింది. వెహికల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ సరిపోలడంతో అది రస్సెల్‌దేనని ధ్రువపడింది. డీలరుకు రస్సెల్‌ ఇదే విషయం చెప్పాడు. కాని అతడు అంగీకరించలేదు. చివరకు ఫిలడెల్ఫియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు లాస్‌ ఏంజిలిస్‌ పోలీసులతో సంప్రదింపులు జరిపారు. చివరకు కారు రస్సెల్‌దేనని ధ్రువీకరించటంతో పోయిన కారు యజమాని వద్దకు చేరింది.