42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
` గత ప్రభుత్వంలో తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారన్నారు. సుమారు 5 నెలల నుంచి ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉన్నాయని చెప్పారు. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు.‘’స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యాయని కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈక్రమంలో సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిజర్వేషన్లను కూడా నిర్ధరించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. ఉన్న పరిస్థితులు, చట్టాలను పరిశీలించాం. 2018లో కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చారు. అందులో 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఉంది. 2019లో తెచ్చిన మున్సిపల్ చట్టంలోనూ ఇదే ఉంది. ఈ రెండు చట్టాలు గుదిబండగా మారడంతో.. మా ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వెంటనే ఆ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించాం. ఆయన దాన్ని కూడా భారత రాష్ట్ర సమితి నేతల మాటలు నమ్మి రాష్ట్రపతికి పంపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని చెబుతున్నారు. ఐదు సార్లు దీని గురించి ప్రధానికి లేఖ రాశాం. ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఈక్రమంలో ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడానికి జంతర్‌మంతర్‌లో ధర్నా చేశాం. 100 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్దతిచ్చారు. రాజ్యసభలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎంపీలు మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బీసీల గురించి మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా రాలేదు. వాళ్ల పార్టీ నాయకుడు బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈరోజు కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం చెందకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నేరవేర్చేందుకు కృషి చేస్తోంది. వీలైతే సహకరించండి. లేదంటే మళ్లీ ప్రజలు మీకు సరైన గుణపాఠం చెబుతారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.