48గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 48గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ఎర్పడితే రాష్ట్రంలో మరోసారి విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల తెలంగాణలోని కొన్ని చోట్ల, కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈ దురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.