49 రోజుల్లో ఢిల్లీలో ఎంతో చేశాం


అభివృద్ధి మాతోటే సాధ్యం : కేజ్రీవాల్‌
అమేథి, ఏప్రిల్‌ 20
(జనంసాక్షి) :
ఢిల్లీని 49 రోజుల పాటు పాలించిన తమ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. అయోధ్యనగర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో తమ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని, ప్రజల సంక్షేమానికి అభివృద్ధి బాటలు వేసిందని తెలిపారు. ఏళ్లకేళ్లుగా నెహ్రూ, గాంధీల కుటుంబం ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి అభివృద్ధికి బహుదూరంలో నిలిచిపోయిందని అన్నారు. అభివృద్ధి తమతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహిళల నుంచి కేజ్రీవాల్‌ నిరసన ఎదుర్కొన్నారు. కేజ్రీవాల్‌ వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఆప్‌ అభ్యర్థి కుమార్‌ విశ్వాస్‌ పక్షాన రోడ్‌ షో నిర్వహించిన కేజ్రీవాల్‌కు మహిళలు నల్లజెండాలతో స్వాగతం పలికారు. మే 7న అమేథిలో పోలింగ్‌ జరుగనుంది.