స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

78 మంది మృతి
శాంటియాగో, (జనంసాక్షి) :
స్పెయిన్‌లో గురువారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాంటియాగో డీ కంపోస్టిలాలోని నార్త్‌ స్పానిష్‌ సిటీలో రైలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరుగింది. అతి వేగంగా దూసుకొస్తున్న రైలు పట్టాలు తప్పి మొదట విద్యుత్‌ స్తంభాన్ని తర్వాత ట్రాక్‌ పక్కనే నిర్మించిన పటిష్టమైన గోడను ఢీకొంది. ఆ వెంటనే ఇంజిన్‌తో పాటు వెనుక బోగీల్లో మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దాలతో ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో తెలిసే లోపే పలువురు ప్రయాణికులు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 78 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. రైల్లో 218 మంది ప్రయాణిస్తుండగా మిగిలిన వారంతా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. 13 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. స్పెయిన్‌లో గత నాలుగు దశాబ్దాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లో ఇదే తీవ్రమైనదని వారు తెలిపారు. ఘటనపై ప్రధాని మారియానో రాజాయ్‌ ఉన్నతాధికారులతో అత్యావసర సమావేశం నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు సహాయ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించనున్నారు. తెల్లవారుజామున ప్రధాని ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. చెల్లాచెదురుగా ఉన్న రైలు బోగీలతో ప్రమాద ప్రాంతమంతా భయానకంగా కనిపించింది.