రాజీనామాల డ్రామాపై విజయమ్మ మాట్లాడాలి


ఇదే పార్టీ నిర్ణయమైతే మేం బయటికెళ్తాం : కొండా సురేఖ
హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) :
సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాలపై విజయమ్మ మాట్లాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు కొండా సురేఖ డిమాండ్‌ చేశారు. పార్టీ నిర్ణయం సమైక్యాంధ్రే అయితే తాము పార్టీ వీడుతామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో తమకు భేధాభిప్రాయాలున్నమాట వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలు బాధాకరమన్నారు. రాజీనామాలు వ్యక్తిగతమా, పార్టీ నిర్ణయం ప్రకారం జరిగాయా అనేది హైకమాండ్‌ స్పష్టం చేయాలని ఆమె కోరారు. దీనివల్ల తెలంగాణాలో పార్టీకి తీవ్ర నష్టం కలుగడం ఖాయమన్నారు. రాజీనామాలపై ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని సూచించారు. పార్టీ భవిష్యత్‌ కావాలా, వ్యక్తి గత ప్రయోజనాలు ముఖ్యమో తేల్చుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయమ్మ ఈఅంశంపై వెంటనే స్పందించాలని లేనిపక్షంలో తెలంగాణాలో జరుగనున్న రెండు, మూడో విడతల పంచాయితీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. విజయమ్మ నుంచి స్పష్టమైన సమాదానం రానిపక్షంలో రెండు రోజుల్లో పార్టీలో కొనసాగడమా, వీడిపోవడమా అనేది ఆలోచించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణాలో తాము మాత్రమే కాదని ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకుంటాయన్నారు. పార్టీ తెలంగాణకు వ్యతిరేకమన్న బావన ఇప్పటికే ఉందని, ఈ రాజీనామాలతో మరింత దూరం అయ్యే అవకాశాలున్నాయని సురేఖ పేర్కొన్నారు. ప్రజల నుంచి ఓట్ల రూపంలో స్పందన అంతంత మాత్రంగానే వస్తున్నా కూడా దానిని పైచేయి సాధిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో రాజీనామాలు చేయడం, వాటిని అధిష్టానం పట్టించుకోక పోవడంతో తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పడుతుందన్నారు.