జయహో తెలంగాణ


ఎందరో వీరుల త్యాగఫలం
అమరులకందరికీ వందనాలు
తెలంగాణ విజయం మీకే అంకితం
తెలంగాణ కల సాకరమయ్యే వేళ ఆసన్నమైంది. పది జిల్లాల ప్రజల ఆకాంక్ష సిద్ధించనుంది. కేంద్ర ప్రభుత్వాన్ని అన్నీ తానై నడిపే ఏఐసీసీ అధినేత్రి, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ ఈమేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు నాలుగున్నర కోట్ల ప్రజల స్వప్నానికి జై కొట్టారు. ఇది ఎందరో వీరుల త్యాగఫలం.
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌
నదీ జలాలు, విద్యుత్‌ పంపిణీపై కమిటీ
ఐదు మాసాల్లో
ప్రక్రియ పూర్తి
జయహో తెలంగాణ
సీమాంధ్రుల దోపిడీ, పీడనల నుంచి విముక్తి కోసం.. స్వపరిపాలన.. ఆత్మగౌరవం కోసం పది జిల్లాల ప్రజలు ఏకమై సాగించిన పోరాటానికి ఢిల్లీ తలవంచింది. తెలంగాణ బిడ్డల పోరుకేక సీమాంధ్ర పెత్తందారుల గుండెల్లో పడిబాకైంది. ఉద్యమ హోరుకు కృత్రిమ ఉద్యమం తోక ముడిచింది. నాలుగు దశాబ్దాల పోరాటంలో తెలంగాణ ఎందరో యువకిశోరాలను కోల్పోయింది. రాజ్యం వివిధ పేర్లు పెట్టి కొందరిని పొట్టనబెట్టుకుంది. సీమాంధ్రుల కుట్రలను చూసి తట్టుకోలేక ఒళ్లంతా దహించుకుపోతున్నా జై తెలంగాణ అని నినదించిన శ్రీకాంతాచారి, యాదయ్య.. మరో వెయ్యి మంది బిడ్డల అమరత్వానికి హస్తిన జడిసింది. మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్రానికి సూచించింది. యూపీఏ భాగస్వామ్య పక్షాలు అది వరకే జై తెలంగాణ అనడంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకే లేకుండా పోయింది. సీమాంధ్రులు బెదిరింపులు తుస్సుమన్నాయి. ఇది తెలంగాణ అమరుల విజయం. ఇది వారికే అంకితం…
తెలంగాణ జాతిపిత : జయశంకర్‌
ఆయన ఉపాధ్యాయుడు. జీవితమంతా తెలంగాణ విముక్త పోరాటం సాగించాడు. ఆయన ఆశ శ్వాస తెలంగాణే. తెలంగాణ చూసి కన్నుమూయాలన్న సార్‌ ఆకాంక్ష ఆయన మరణానంతరమే నెరవేరింది. ఆయన జీవితకాల పోరాటానికి అర్థం చేకూరింది. తెలంగాణ ఉద్యమాన్ని బలీయ శక్తిగా మలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ కలలు కన్న రోజు రానే వచ్చింది. మరో నాలుగైదు నెలల్లో వలస పాలన నుంచి తెలంగాణ గడ్డ విముక్తం కానుంది. మనకు స్వాతంత్య్రం సిద్ధించనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు ప్రారంభించనున్నాయి. తన జీవితమే తెలంగాణగా మలుచుకున్న జయశంకర్‌ సార్‌ తెలంగాణకు జాతిపిత.
న్యూఢిల్లీ, జూలై 30 (జనంసాక్షి) :
యునైటెడ్‌ ప్రొగెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ), కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) తెలంగాణకు జై కొట్టాయి. రెండు సమావేశాల్లోనూ తెలంగాణపై ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించాయి. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని నివాసం సెవన్‌ రేస్‌కోర్స్‌ రోడ్‌లో యూపీఏ భేటీ నిర్వహించగా, సాయంత్రం ఐదున్నర గంటలకు సోనియాగాంధీ నివాసం టెన్‌ జన్‌పథ్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఏఐసీసీ మీడియా వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్‌మాకెన్‌, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విడగొట్టేందుకు తీసుకున్న నిర్ణయం సుదీర్ఘ పోరాటాలు, తెలంగాణ చరిత్రను చూశాకేనని పేర్కొన్నారు. రాజకీయ కోణంలో, ఓట్లు సీట్లకోసం తాము రాష్ట్రం ఏర్పాటు చేయడం లేదన్నారు. తెలంగాణను పదిజిల్లాలతో హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రాన్నే ఏర్పాటు చేస్తున్నామన్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఈలోగా సీమాంధ్రలో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో చూసి అక్కడే నూతన రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటుందన్నారు. సమస్యలు పరిష్కరించుకునేందుకుగాను క్యాబినెట్‌ సబ్‌కమిటీ కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఇప్పటివరకు తాము ఎన్నోరకాలుగా చర్చలు, సంప్రదింపులు నిర్వహించామన్నారు. యూపీఏ, సిడబ్ల్యూసిల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ప్రతిని కేంద్రానికి పంపిస్తారన్నారు. కేబినెట్‌ కమిటీ రూపొందించిన అంశాలను న్యాయశాఖకు పంపిస్తారని, ఆ తర్వాత బిల్లు రూపొందుతుందన్నారు. ఆ బిల్లును క్యాబినెట్‌ ఆమోదించి రాష్ట్రపతికి పంపిస్తామని తెలిపారు. అక్కడి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి చేరుతుందని, ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా అనేది అప్రధాన్యమే అవుతుందన్నారు. అక్కడి నుంచి వచ్చాక కేబినెట్‌ నిర్ణయం తీసుకుని పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదం పొందుతుందన్నారు. అనంతరం తిరిగి రాష్ట్రపతికి పంపించడం, ఆమోదంపొందడం చకచకా సాగిపోతాయన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణను ఏర్పాట చేస్తున్నామన్నారు. సీమాంధ్రకు సంబంధించి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆమోదిస్తూ కేంద్రం చేపట్టాలని కూడా కోరామన్నారు. టీఆర్‌ఎస్‌ విలీనం గురించి మాట్లాడుతూ ఆయనే తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతానని ఇచ్చిన మాటపై నిర్ణయం ఆయనే తీసుకోవాలన్నారు. అయితే చర్చలు కొనసాగిస్తామని దిగ్విజయ్‌సింగ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌పై అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్‌ సుమారు 60 ఏళ్లుగా కొనసాగుతుందన్నారు. అలాగే తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. వెనుక బడిన ప్రాంతాలను అబివృద్ధి చేసేందుకు నిధులు కూడా భారీగా విడుదల చేస్తామని తెలిపారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో రెండవ ఎస్సార్సీకే నిర్ణయాధికారం కట్టబెట్టారని తెలిపారు. ముసాయిదాను బుధవారమే హైదరాబాద్‌కు పంపించే అవకాశాలున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశం ప్రత్యేకంగా జరుగుతుందన్నారు. సీమాంధ్రుల ఆస్తులు, హక్కుల పరిరక్షణకు మాత్రం అవసరమైతే చట్టం చేస్తుందన్నారు. యూపీఏ భేటీలో చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులు దిగ్విజయ్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌సింగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరుక్‌ అబ్దుల్లా, ముస్లిం లీగ్‌ నేత ఇ. అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.