రాజీ’డ్రామా’లపై కేంద్ర మంత్రుల వెనకడుగు


హై పవర్‌ కమిటీకి దిగ్విజయ్‌ హామీ
అదే బాటలో పలువురు ఎంపీలు
న్యూఢిల్లీ, ఆగస్టు 2 (జనంసాక్షి) :
రాజీ’డ్రామా’లపై కేంద్ర మంత్రులు వెనుకడుగు వేశారు. సీమాంధ్ర నేతల్లో విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి. గురువారం రాత్రి కేవీపీ నివాసంలో జరిగిన భేటీకి 14 మంది హాజరు కాగా, కేవలం ఆరుగురే రాజీనామా చేయడం వారిలోని అనైక్యతను చాటిచెప్పాయి. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ బీరాలు పలికిన పలువురు నేతలు మొహం చాటేశారు. చివరి నిమిషంలో వెనుకడుగు వేశారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం సమావేశమైన నేతలు విభజన అంశంపై చర్చించారు. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ భేటీలో హైకమాండ్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే అంశం చర్చ జరిగింది. రాజీనామాలపై మల్లగుల్లాలు పడ్డారు. భేదాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ చివరకు ఎలాంటి నిర్నయం ప్రకటించకుండానే ఎంపీలు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం నిర్ణయం ప్రకటిస్తామని లగడపాటి రాజగోపాల్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తదితరులు చెప్పినప్పటికీ, ఏ నిర్ణయం వెల్లడించలేదు. 11 గంటల సమయంలో ఆరుగురు ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌కు చేరుకున్నారు. మిగతా వారు వస్తారని భావించినప్పటికీ ఎవరూ రాకపోవడంతో వారు రాజీనామాలు సమర్పించారు. గురువారం రాత్రి కేవీపీ నివాసంలో జరిగిన భేటీకి 14 మంది హాజరు కాగా, కేవలం ఆరుగురే రాజీనామాలు చెయడం వారిలోని అనైక్యతకు నిదర్శనం.
వెనుకడుగు వేసిన కనుమూరి
నర్సాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు వెనక్కుతగ్గారు. సమైక్యవాణిని వినిపిస్తున్న ఆయన కూడా పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం చివరి నిమిషంలో వెనుకడుగు వేశారు. బాపిరాజు మొదటి నుంచి అధిష్టానం మాటే చెబుతూ వచ్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అయితే, గురువారం రాత్రి కేవీపీ నివాసంలో జరిగిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీల భేటీకి ఆయన హాజరు కావడంతో బాపిరాజు కూడా రాజీనామా చేస్తారని భావించారు. కానీ, ఆయన చివరి నిమిషంలో మొహం చాటేశారు. శుక్రవారం లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్‌, అనంతవెంకట్రామిరెడ్డి, కేవీపీ, సాయిప్రతాప్‌ రాజీనామా చేయగా, ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. కాగా, కేంద్ర మంత్రులు పల్లంరాజు, పురంధేశ్వరి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు కూడా రాజీనామాలు చేస్తారని వార్తలొచ్చాయి. మంత్రి పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించినా వారు పదవులు వదులుకొనేందుకు నిరాకరించారు. రాజీనామాలు అనవసరమని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యానించడం గమనార్హం.
మొహం చాటేసిన చిరంజీవి, కావూరి
వాస్తవానికి రాజీనామాల విషయంలో కేంద్ర మంత్రులు, ఎంపీల్లో విభేదాలు నెలకొన్నాయి. హైకమాండ్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గురువారం రాత్రి కేవీపీ నివాసంలో జరిగిన సీమాంధ్ర ప్రాంత ఎంపీల భేటీకి ఐదుగురు మంత్రులు దూరంగా ఉండడం, భేటీకి 14 మంది హాజరు కాగా, కేవలం ఆరుగురు ఎంపీలు మాత్రమే రాజీనామా చేయడం వారిలోని అనైక్యతకు నిదర్శనం. కేవీపీ నివాసంలో జరిగిన భేటీకి పళ్లంరాజు, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, జేడీ శీలం మాత్రమే హాజరు కాగా, చిరంజీవి, కావూరి సాంబశివరావు, కిశోర్‌ చంద్రదేవ్‌, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి తదితరులు గైర్హాజరయ్యారు. ఈ భేటీలోనూ సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయాల్సిందేనని లగడపాటి, కేవీపీ వంటివారు గట్టిగా వాదిస్తుంటే, అలా చేస్తే హైకమాండ్‌ను ఎదిరించినట్లేనని మరికొందరు వాదించారు.