నిర్ణీతకాలంలోనే తెలంగాణ ప్రక్రియ


విభజనకు హోం శాఖ నోట్‌
రెండు రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్‌
శాంతియుత విభజనకు సహకరించండి
రాజీనామాలు చేస్తే చట్టసభలో మీ వాణి ఎలా వినిపిస్తారు : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) :
నిర్ణీత కాలంలోనే తెలంగాణ ప్రక్రియ చేపడుతామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల సీమాంధ్రులకు ఎదురయ్యే సమస్యలు తెలుసుకోవడానికి, ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు సేకరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో తాను సభ్యుడిగా ఉంటానని పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడే సమయంలో విభజన కోరుకునే వారు మరింత సంమయనంతో వ్యవహరించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణ చెడిపోకుండా ఉండటానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే చట్టసభల్లో వారి వాణి ఎలా వినిపిస్తారని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలు చెప్పుకునేందుకైనా రాజీనామాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆస్తులు, అప్పుల పంపకాలు, రాష్ట్ర విభజనకు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం కేబినెట్‌ కమిటీని నియమించనుంది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి వచ్చే వారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఓ ప్రకటన రానుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీకి ఈ కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కమిటీ చైర్మన్‌ పదవికి ఆంటోనీతో పాటు కేంద్ర మంత్రులు చిదంబరం, సుశీల్‌కుమార్‌ షిండే, శరద్‌ పవార్‌ల పేర్లు కూడా వినిపిస్తన్నాయి. అయితే, ఆంటోనీకే ఈ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది. డిసెంబర్‌ 9 ప్రకటన, ఆ తర్వాత డిసెంబర్‌ 23 ప్రకటన రావడానికి జరిగిన పరిణామాల్లో కేంద్ర మంత్రి చిదంబరం హస్తం ఉందని తెలంగాణవాదుల నుంచి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కమిటీ బాధ్యతలను స్వీకరించడానికి ఆయన అనాసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక, రాష్ట్ర విభజనను పర్యవేక్షించే ¬ం శాఖ మంత్రిగా షిండే ఉండడంతో ఆయనకు కూడా ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం లేదు. మరో సీనియర్‌ మంత్రి శరద్‌ పవార్‌ తెలంగాణ పక్షపాతిగా పేరుంది. ఆయనను సీమాంధ్ర నేతలు ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. వీరందరికంటే సమర్థుడు, వివాదాస్పదుడు, కాంగ్రెస్‌ పార్టీలో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఆంటోనీకి కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నిజాయతీపరుడిగా ఆయనకు విమర్శకుల్లో సైతం పేరుంది. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉండడంతో ఆయనకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలున్నాయి. రాష్ట్ర విభజన విధివిధానాల కమిటీ అధ్యక్షుడిగా ఆయన్ను నియమిస్తే అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే మంత్రిమండలి సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే, విభజనకు సంబంధించి ¬ం శాఖ క్యాబినెట్‌ నోట్‌ తయారీలో తలమునకలైంది. ప్రధాని కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు ¬ం శాఖ క్యాబినెట్‌ నోట్‌ రూపకల్పనలో నిమగ్నమైంది. వచ్చే వారం జరగనున్న మంత్రిమండలి సమావేశానికల్లా నోట్‌ను తయారు చేసి, అందించనున్నట్లు సమాచారం.