నా రాజీనామాతో విభజన ఆగదు


చిరంజీవి నిర్వేదం
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) :
తన రాజీనామాతో ఆంధ్రప్రదేశ్‌ విభజన ఆగదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. కేసీఆర్‌ మాటలకు రెచ్చిపోవద్దని, ఆయన మాటలను పట్టించుకోవద్దని, రాజకీయ నిరుద్యోగిని అవుతానన్న భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని చిరంజీవి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కొనసాగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాల సమస్యలను పరిష్కరించేందుకు, చర్చించేందుకు కేంద్రమంత్రి ఏకె ఆంటోని ఆధ్వర్యంలో ఒక హైలెవెల్‌ కమిటీ ఏర్పాటు కానున్నదని తెలిపారు. తొలి నుంచి తాను సమైక్యవాదినేనని అన్నారు. ప్రజారాజ్యంపార్టీ స్థాపించినప్పుడు కూడా సమైక్యవాదిగానే అన్ని ప్రాంతాలలో పర్యటించానని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకోవడం తన బాధ్యత అని అన్నారు. సీమాంధ్ర ప్రాంతం ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నానని అన్నారు. కెసిఆర్‌ రాజకీయాల కోసం భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. మరో మారు అలా వ్యాఖ్యానిస్తే తగిన విధంగా బదులు ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజలకు, ఉద్యోగులకు భరోసా కల్పించేలా కెసిఆర్‌ మరోసారి మాట్లాడాలని కోరారు. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్‌ రాజధానిగా ఉండాలన్నది తన అభిప్రాయమన్నారు. అదే విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళతానని అన్నారు. సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పదవి వీడడానికి కూడా వెనుకాడబోనని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితం హైదరాబాద్‌తో ముడిపడి ఉందని అన్నారు. శాశ్వత రాజధాని హైదరాబాద్‌ను ఉంచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. అధిష్టానం కూడా అందుకు అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.