వక్ఫ్‌భూముల పరిరక్షణకు జ్యుడిషియల్‌ అటానమస్‌ బాడీ


తెలంగాణ పునర్నిర్మాణంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు
పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు
వైద్య బీమా వర్తింపు
ఎస్సీల కంటే ముస్లింలే వెనుకబాటు
సచార్‌ కమిటీ నివేదించింది
ఉర్దూ ప్రాతినిథ్యం పెంచుతాం
పాత బస్తీ ప్రజల జీవన విధానంలో మార్పు
చెంచల్‌గూడ జైలు ఎత్తేసి విద్యాలయంగా మారుస్తాం
రేస్‌కోర్స్‌ తీసేసి ముస్లింల అభివృద్ధికి వినియోగిస్తాం
మీట్‌ ది ప్రెస్‌లో జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ ప్రశ్నలకు కేసీఆర్‌ సమాధానాలు
హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) :
నిజాం సర్కారు నుంచి ముస్లింలకు సంక్రమించిన వక్ఫ్‌బోర్డు భూముల పరిరక్షణకు పూర్తి అధికారాలు, స్వయం ప్రతిపత్తితో కూడిన జ్యుడిషియల్‌ అటానమస్‌ బాడీని ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని తాజ్‌ డక్కన్‌ హోటల్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో జనంసాక్షి దినపత్రిక ఎడిటర్‌ ఎం.ఎం. రహమాన్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘంగా సమాధానాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విలీనానికి ముందు హైదరాబాద్‌ స్టేట్‌లో అధికార భాషగా ఉన్న ఉర్దూ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో జవసత్వాలు కోల్పోయిందని, ఇందుకు సీమాంధ్ర పాలకుల విధానాలే కారణమని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉర్దూ ప్రాతినిథ్యం పెంచుతామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం కార్యాలయంలో కూడా ఉర్దూలో వినతిపత్రాలు ఇస్తే తీసుకునే యంత్రాంగం లేదని, ఇది విచారకరమని అన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలకు చెందాల్సిన వక్ఫ్‌ బోర్డు భూములపై హక్కులు కల్పించి తీరుతామన్నారు. భూములు కేటాయించే సమయంలో విద్య అవసరాలకో, మసీదుల అభివృద్ధికో, నిరుపేదల ఆహార అవసరాల కోసం దానం చేసి ఉంటారని, వాటి నిజ ప్రతుల ఆధారంగా వక్ఫ్‌ భూములన్నీ తిరిగి తీసుకొని ఏయే అవసరాల కోసం దానం చేశారో ఆయా అవసరాలకే కేటాయిస్తామని అన్నారు. నిజాం కాలంలో పాలకులతో పాటు భూస్వాములు కూడా వివిధ అవసరాల కోసం భూములు దానం చేశారని, వాటన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకొని ముస్లింల అభివృద్ధి కోసం వినియోగిస్తామని అన్నారు. సీమాంధ్రుల వలస పాలనలో హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతమైన వాస్తవేనని అన్నారు. ఇప్పుడు వాటన్నింటిని తిరిగి తీసుకుంటామన్నారు. వక్ఫ్‌బోర్డు భూముల్లో నిర్మించిన చంచల్‌గూడ జైలును ఎత్తేసి విద్యాలయంగా మార్చుతామని అన్నారు. ఖైదీలు, నేరగాళ్లతో నిండి ఉన్న ఆ ప్రాంతాన్ని విద్యాక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వక్ఫ్‌బోర్డ్‌ భూముల్లో వేసిన రేస్‌కోర్స్‌ను స్వాధీనం చేసుకొని ముస్లింల అభివృద్ధికి వినియోగిస్తామని పేర్కొన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు ఇక అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు అన్నిరకాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలు ఎస్సీ, ఎస్టీల కంటే వెనుకబడ్డారని సచార్‌ కమిటీ గుర్తించిందని, కానీ సచార్‌ కమిటీ నివేదికలు మాత్రం ప్రభుత్వాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని తెలిపారు. సచార్‌ కమిటీ సిఫార్సుల మేరకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని అన్నారు. హైదరాబాద్‌ పాత బస్తీలోని ముస్లింల జీవన విధానంలో సంపూర్ణ మార్పు తీసుకువస్తామని అన్నారు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఉర్దూకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైనదని కొనియాడారు. తెలంగాణ సాధించడంలో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ వారు ఉద్యమ స్ఫూర్తిని ప్రస్పుటం చేయాలని కోరారు. తక్కువ వేతనాలతో పనిచేసే జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలు పంచుకున్న జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. తెలంగాణ పాత్రికేయులందరికీ జిల్లా స్థాయి నుంచి హైదరాబాద్‌ వరకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని తెలిపారు. అందరికీ వైద్య బీమా సౌకర్యం వర్తింపజేస్తామని అన్నారు. అసమానతలు అంతరాలు లేని తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయమన్నారు. తెలంగాణలో అద్భుత వనరులున్నాయని చెప్పారు. ప్రకృతిపరంగా ఉన్న సింగరేణి గనులు తెలంగాణలో ఉన్నయాని గుర్తు చేశారు. సింగరేణి గనుల్లో యంత్ర పరికరాల వినియోగాన్ని తగ్గించి కార్మికులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. తెలంగాణలో భవిష్యత్‌లో విద్యుత్‌ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత అనుకూలమని పారిశ్రామిక వేత్తలు చెప్పిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. వాతావరణం కూడా పెట్టుబడులకు అనుకూలమని తెలిపారు. ప్రపంచంలో పెట్టుబడులకు అనుకూల నగరం హైదరాబాద్‌ అని అన్నారు. హైదరాబాద్‌లో నిజాం కాలంలోనే వందకుపైగా పరిశ్రమలున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు కృషి చేస్తానని అన్నారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర విభజన జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ ప్రాంతంలో ఉండాలనుకునే ఉద్యోగులు ఇక్కడే రిటైర్‌ కావొచ్చని, ఫ్లాట్‌ కొనుక్కొని జీవించవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణ కోరుకునే వారి దిష్టిబొమ్మలు దహనం చేసేవాళ్లు ఇక్కడ ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుడుగా ప్రశ్నించింది. తెలంగాణలో కేవలం 15 శాతమే అగ్రవర్ణాల వారు ఉన్నారని, మిగతా వారంతా ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల వరేనని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. తెలంగాణ ఏర్పడిన కొద్ది రోజుల్లోనే పది వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయించి కరెంట్‌ కోతలు లేకుండా చూస్తామని అన్నారు. రాజ్యాంగం ప్రకారమే పంపకాలు జరుగుతాయని కేసీఆర్‌ అన్నారు. ఆస్తులు, అప్పులు పంపకం కేంద్ర ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే ఉంటుందని అన్నారు. ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, చత్తీస్‌ గడ్‌ రాష్ట్రాల విభజన సమయంలో కేంద్రం ఎలా నడుచుకుందో అదే పద్ధతిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలోనూ నడుచుకుంటుందని అన్నారు.
అపార సంపద ఉంది..
తెలంగాణలో అద్భుతమైన వనరులు ఉన్నాయని అన్నారు. బొగ్గు గనులు ఉన్నాయన్నారు. అటవీ ప్రాంతం ఉందన్నారు. మాంగనీస్‌, బాక్సైట్‌, ఐరన్‌ఓర్‌ పుష్కలమని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని తెలంగాణను వ్యవసాయపరంగాను, పారిశ్రామికపరంగాను అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ప్రపంచ ప్రసిద్ధి చెందిందన్నారు. ఆంధ్రా పాలకులు దాన్ని విధ్వంసం చేసి వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలుగా పెట్టారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక బోధన్‌ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక చెరుకు ఉత్పత్తి విషయంలో రైతులను ప్రోత్సహించి.. షుగర్‌ ఫ్యాక్టరీ లాభాల బాటలో నడిపించేలా కృషి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరులో పెట్టాల్సిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని విజయవాడకు తరలించుకుపోయారని ఆరోపించారు. అయినప్పటికీ అయిదేళ్ల పాటు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉండేంతవరకు కృషి చేస్తామని అన్నారు.
10 జిల్లాలకుతోడుగా..
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు తోడుగా మరో 14 జిల్లాలు ఏర్పాటు చేస్తామని కెసిఆర్‌ హామీ ఇచ్చారు. అంతేగాక హైదరాబాద్‌ను గ్రీన్‌ సిటీగా మారుస్తామన్నారు. అలాగే హైదరాబాద్‌కు ఆవల వంద కిలోమీటర్ల పరిధిలో టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని కెసిఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరం నాలుగు వైపులా అభివృద్ది చెందేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. చిత్రసీమ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. హైదరాబాద్‌ నగరానికి మరో ఎయిర్‌పోర్టు ఆవశ్యకత ఉందన్నారు. మరో ఎయిర్‌పోర్టు వస్తే తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వైద్యానికి పెద్ద పీట వేస్తామన్నారు. మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను నిమ్స్‌ తరహా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. వాటన్నింటిని ప్రభుత్వ అధీనంలోనే నడిచేలా చర్యలు తీసుకుంటా మన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాదిరిగా అన్ని సేవలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.