వెనకడుగు వేయం సీమాంధ్ర నేతలకు తేల్చిచెప్పిన సోనియా

అభ్యంతరాలకు నలుగురు సభ్యులతో కమిటీ
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఈ దశలో వెనక్కు పోలేమని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చి చెప్పింది. విభజనపై ఏమైనా అనుమానాలు, అపోహలు ఉంటే హైలెవెల్‌ కమిటీకి చెప్పుకోవాలని సూచించింది. తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగే సమయంలో అభ్యంతరాలు లేవనెత్తాలని సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులకు తెలిపింది. ఇప్పటికే రాజ్యాంగబద్ద ప్రక్రియ ప్రారంభమైనందున నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితోనూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఇదే విషయం స్పష్టత ఇచ్చారు. అభ్యంతరాలేమైనా ఉంటే పార్టీ ఏర్పాటు చేసే హైలెవల్‌ కమిటీ ముందు చెప్పుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు మంగళవారం అధిష్టానం పెద్దలతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు చిదంబరం, గులాం నబీ ఆజాద్‌ తదితరులతో భేటీ అయ్యారు. లోక్‌సభ వాయిదా పడిన అనంతరం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లం రాజు తదితరులు ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలతో ఉన్నారని, సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతామనే భయం కూడా ఉందన్నారు. తమ అభ్యంతరాలపై స్పష్టత ఇచ్చే వరకూ తెలంగాణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఇదే విషయాన్ని ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు. వారు చెప్పిందంతా విన్న చిదంబరం రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని, రాజ్యాంగబద్ధ ప్రక్రియ కూడా ప్రారంభమైందని చెప్పారు. ఈ దశలో వెనక్కుపోలేమని తేల్చిచెప్పారు. విభజన సమయంలో ఇరు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. విభజనపై ఉన్న అనుమానాలు, అభిప్రాయాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైలెవెల్‌ కమిటీ ఎదుట మీ వాదనలు వినిపించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజలను అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంత వాసుల అభ్యంతరాలు చెప్పే వరకూ తెలంగాణ ప్రక్రియ నిలిపివేయాలని చిదంబరాన్ని కోరామని కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. భేటీ ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. తాము లేవనెత్తిన అంశాలను చిదంబరం శ్రద్ధగా విన్నారని చెప్పారు. తమ ప్రాంత సమస్యలు చెప్పే వరకూ తెలంగాణ ప్రక్రియను నిలిపివేయాలని కోరామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరిన్లు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్‌, మొయిలీలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ ముందు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాదనలు వినిపిస్తారన్నారు. పళ్లం రాజు మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు మొదలయ్యాయని, కేసీఆర్‌ వ్యాఖ్యల తర్వాత హైదరాబాద్‌లో సెటిలర్లకు అభద్రతాభావం పెరిగిందన్నారు. ఇదే అంశాన్ని చిదంబరం దృష్టికి తీసుకెళ్లగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య రాజీ కుదిర్చే బాధ్యతలను కాంగ్రెస్‌ పార్టీ నలుగురు సభ్యులతో కూడిన కమిటీకి అప్పగించింది. ఈమేరకు మంగళవారం ఏఐసీసీ ఉన్నత స్థాయి కమిటీని ప్రకటించింది. నలుగురు సభ్యులతో కూడిన కమిటీకి ఏకే ఆంటోని నేతృత్వం వహిస్తారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌, వీరప్పమొయిలీ, అహ్మద్‌ పటేల్‌ సభ్యులుగా ఉంటారు.