అసలురంగు బయటపెట్టుకున్న ఊసరవెల్లులు
సీమాంధ్రకనుకూలంగా జగన్, విజయమ్మ రాజీనామా
హైదరాబాద్, ఆగస్టు 10 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అసలు రంగు బయట పట్టుకుంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లోనే వారు రాజీనామా చేసినట్టు ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మైసూరా రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడారు. తొలుత ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, అందరికీ సమన్యాయం చేయండి.. లేదంటే యధాతథ పరిస్థితి కొనసాగించండి అని జగన్మోహన్‌రెడ్డి, విజయమ్మ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారని అన్నారు. ప్లీనరీలోనే ఆ విషయాన్ని చెప్పామన్నారు. అందరికీ న్యాయం చేయాలనే కోరుతున్నామన్నారు. సమన్యాయం కోసమే జగన్, విజయమ్మ పదవులను వీడారన్నారు. చంచల్‌గూడ జైలనుంచి జగన్మోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని పంపారన్నారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి విజయమ్మ, కడప ఎంపి పదవికి జగన్ రాజీనామా చేశారన్నారు. తెలుగు ప్రజలపట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగానే వారిద్దరు స్పందించారని అన్నారు. అనంతరం మైసూరారెడ్డి మాట్లాడుతూ, పరిష్కారం చూపాకే విభజన చేయాలని తాము ఏనాడో చెప్పామన్నారు. ఓ కన్నతండ్రిలా ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో తెలియజేశామన్నారు. అదే విషయంపై పది రోజుల తర్వాత సీఎం కిరణ్ కుమార్ స్పందించారన్నారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు అదే బాటలో నడుస్తున్నారన్నారు. తాము ముందునుంచి ఒకటే మాటమీద ఉన్నామని, మిగిలిన రెండు పార్టీలు ఇప్పుడు సన్మార్గంలోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే విజయమ్మ, జగన్ రాజీనామా చేశారన్నారు. సిఎం వ్యాఖ్యలవల్లే ఆ పార్టీ వైఖరి వెల్లడవుతోందన్నారు. కొత్తగా తామేమీ చెప్పేది లేదన్నారు. ఓట్లు, సీట్లు కావాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడలతో పోతోందన్నారు. పరిష్కారం చూపాకే విభజన చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.